ఎమ్మెల్యే సైదిరెడ్డిపై  ఎంపీ ఉత్తమ్ కుమార్ ఫైర్

ఎమ్మెల్యే సైదిరెడ్డిపై  ఎంపీ ఉత్తమ్ కుమార్ ఫైర్

హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడుతున్నాడని నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. ఆదివారం హుజూర్ నగర్ లోని క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి అవినీతి, అరాచకాలు రోజురోజుకు హద్దు మీరుతున్నాయని మండిపడ్డారు. ప్రతి కాంట్రాక్టులో 1 0శాతం కమీషన్ తీసుకుంటున్నాడని ఆరోపించారు. కాంట్రాక్టుల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి వల్ల ఎంత  నష్టం జరిగిందో వివరిస్తూ నేరేడుచర్ల మండలానికి చెందిన వైస్ ఎంపీపీ లక్ష్మీనారాయణ వాట్సాప్​లో పెట్టిన లెటరే అందుకు ఉదాహరణ అన్నారు. ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు ఎవరూ ఇంత అవినీతికి పాల్పడలేదన్నారు. పాలకీడు మండలంలో నిర్మిస్తున్న చెక్ డ్యాంలు ఎమ్మెల్యే, కాంట్రాక్టర్ జేబులు నింపడానికే తప్ప ప్రజలకు ఉపయోగపడేవి కాదన్నారు. చెక్ డ్యాం నిధుల దుర్వినియోగంపై నాబార్డులోని విజిలెన్స్ కమిటీకి కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. ఎల్ఈడీ, బ్లీచింగ్ పౌడర్, ట్రాక్టర్ల కొనుగోళ్లలో గ్రామ పంచాయతీల్లో రూ.కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యానికి చెందిన 107 ఎకరాల భూమిని ఎమ్మెల్యే తన బినామీల పేరుమీద రిజిస్టర్ చేసుకున్నారని, మంచ్య తండాలో పవర్ ప్లాంట్ కోసం సేకరించిన గిరిజనుల భూమిని ఆక్రమించుకున్నారని చెప్పారు. సీఎం నిధుల నుంచి హుజూర్ నగర్ మున్సిపాలిటీకి 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15కోట్లు రిలీజ్​అవ్వగా కమీషన్ల కోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్​కు మళ్లించారని ఆరోపించారు. నియోజకవర్గంలోని అవినీతిపై త్వరలో సీబీఐకు కంప్లైంట్​చేస్తామన్నారు.