రేడియాలజిస్ట్ అంటూ మోసం... కిలాడి లేడీ ఆట కట్టించిన నల్గొండ పోలీసులు

రేడియాలజిస్ట్ అంటూ మోసం... కిలాడి లేడీ ఆట కట్టించిన నల్గొండ పోలీసులు

నల్గొండ, వెలుగు: హైదరాబాద్  నిమ్స్ లో రేడియాలజిస్ట్ నని, ఐఏఎస్ లో మంచి ర్యాంక్  వచ్చిందని త్వరలో పోస్టింగ్ రానుందని, తండ్రి సైతం ఏఎస్పీ అంటూ యువకులను బురిడీ కొట్టించిన యువతిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్  పోలీసులు అరెస్ట్  చేసి రిమాండ్ కు పంపించారు. వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ  మండలం లావుడి తండాకు చెందిన లావుడి సరిత అలియాస్  ప్రత్యూష హైదరాబాద్​లో హాస్టల్లో ఉంటూ సెల్ ఫోన్లను చోరీ చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడింది. తాను ఏఎస్పీ కూతురునని నమ్మించింది. రేడియాలజిస్ట్ డాక్టర్ అంటూ మాయమాటలు చెప్పింది. 

కలెక్టర్  అయ్యానంటూ అమాయకులను బురిడీ కొట్టించి బుట్టలో వేసుకుంది. సరిత అలియాస్  ప్రత్యూష. సోషల్  మీడియాలో తన సక్సెస్  స్టోరీ అంటూ ఓ కట్టు కథ సైతం అల్లింది. ఇలా పలువురు యువకులను ట్రాప్  చేసి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ లక్షల్లో డబ్బులు డిమాండ్  చేసింది.  ఇలా ఓ యువకుడిని వేధించడంతో పోలీసులను ఆశ్రయించాడు. వారు ఆమెను అరెస్ట్​ చేసి విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. 

సరిత ఈజీ మనీకి అలవాటు పడి డబ్బున్న వాళ్లను టార్గెట్  చేయడం, వలపు వల విసిరి బ్లాక్  మెయిల్  చేసి అందిన కాడికి దోచుకోవడం అలవాటుగా మార్చుకుంది. అమాయకులను మాయమాటల్లో పెట్టి మొబైల్స్  దొంగిలించేది. గతంలో నార్కట్ పల్లి లో ఓ వైద్యుడిని ట్రాప్  చేసి బ్లాక్ మెయిల్  చేసి రూ.3 లక్షల వరకు వసూలు చేసింది. సరితపై మలక్ పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్  పీఎస్ లో చోరీ కేసులు, నార్కట్ పల్లి, నల్గొండ వన్ టౌన్  పీఎస్ లలో చీటింగ్ కేసు నమోదయ్యాయి. సరితను మిర్యాలగూడ వన్ టౌన్  పోలీసులు అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించారు.