- అభ్యర్థిత్వం ఖరారు కాకున్నా నామినేషన్లు
యాదాద్రి, నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు కొన్ని పంచాయతీలు, వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డులకు చాలా తక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. శుక్రవారం నుంచి నామినేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఎన్నికల ఆఫీసర్లు అంటున్నారు.
అభ్యర్థిత్వం ఖరారు కాకున్నా..
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దీంతో రాజకీయ పార్టీలు చాలా చోట్ల సర్పంచ్ అభ్యర్థులను ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు చేయలేదు. అయితే సర్పంచ్‌గా పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్న వాళ్లు బ్యాంకుల్లో కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసి, అవసరమైన పత్రాలను సమకూర్చుకొని నామినేషన్లు వేస్తున్నారు. ఉప సంహరణ సమయానికి తమ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందన్న ఆశతో చాలా మంది ఉన్నారు.
కొందరు మాత్రం తమను ఖరారు చేయకుంటే రెబల్‌గా బరిలో ఉంటామని సంకేతాలు పంపిస్తున్నారు. ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో అభ్యర్థిత్వాలు ఖరారు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి కొంత ఇబ్బందిగానే ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్‌కు, ఆపార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతోంది. అయితే కొందరైతే ఉప సంహరణ కోసం బేరసారాల మీద ఆశతో నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు.
మొదటి రోజు ఇలా..
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 630 గ్రామ పంచాయతీలు, 5,598 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సర్పంచ్ పదవులకు ఆశావహులు మొదటి రోజు తమ నామినేషన్లను దాఖలు చేశారు. గురువారం ఉదయం నుంచే సర్పంచ్వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ పంచాయతీలకు కేటాయించిన క్లస్టర్లకు వద్దకు బలపరిచే వారితో కలిసి వచ్చారు. నామినేషన్లను పూరించడానికి క్లస్టర్ల వద్ద ఉన్న హెల్ఫ్‌డెస్క్ సిబ్బంది సహకరించారు.
5 గంటల వరకూ క్లస్టర్లలోనికి వచ్చిన వారికి నామినేషన్ వేయడానికి అవకాశం కల్పించారు. కొందరు రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. చాలా వార్డులకు నామినేషన్లు వేయలేదు. ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరణ, 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 వరకు గడువు ఉంది. డిసెంబర్ 11 ఎన్నికలు జరుగుతాయి.
సర్పంచ్ అభ్యర్థిత్యం ఖరారైతేనే.. వార్డు మెంబర్లు
సర్పంచ్ అభ్యర్థిత్వాలు ఖరారైతేనే వార్డు మెంబర్ల అభ్యర్థిత్వం ముడిపడి ఉంది. సర్పంచ్ గా పోటీ చేస్తున్న వ్యక్తి తమ ప్యానెల్లో వార్డు మెంబర్‌గా పోటీకి చేసే వారికి అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో సర్పంచ్ కు దాఖలైన స్థాయిలో వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలు చేయలేదు. కాగా నామినేషన్ దాఖలు చేస్తున్న క్లస్టర్లను కలెక్టర్ హనుమంతరావు సందర్శించి పరిశీలించారు.
జిల్లాల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి
సూర్యాపేట జిల్లా
మండలాలు జీపీలు సర్పంచ్ వార్డు
తుంగతుర్తి 24 24 9
నాగారం 14 30 4
నూతన్‌కల్ 17 34 8
తిర్మలగిరి 16 17 0
జాజిరెడ్డిగూడెం 17 15 3
మద్దిరాల 16 17 2
సూర్యాపేట 25 40 7
ఆత్మకూరు(ఎస్) 30 30 5
యాదాద్రి జిల్లా
మండలాలు జీపీలు సర్పంచ్ వార్డు
ఆలేరు 16 15 9
రాజాపేట 23 34 21
యాదగిరిగుట్ల 23 31 49
ఆత్మకూరు(ఎం) 23 43 14
బొమ్మల రామారం 35 33 7
తుర్కపల్లి 33 49 34
నల్గొండ జిల్లా
మండలాలు జీపీలు సర్పంచ్ వార్డు
చండూరు 19 29 21
చిట్యాల 18 29 21
గట్టుప్పల్ 7 10 4
కనగల్ 31 44 7
కట్టంగూర్ 22 23 21
కేతేపల్లి 16 31 10
మర్రిగూడ 18 21 9
మునుగోడు 28 33 20
నకిరేకల్ 17 21 11
నల్గొండ 31 25 16
నాంపల్లి 32 27 16
నార్కట్ పల్లి 29 47 43
శాలి గౌరారం24 34 10
తిప్పర్తి 26 47 25
