V6 ఆన్ లైన్ పోల్ ని వక్రీకరించేందుకు‘నమస్తే’ ప్రయత్నం

V6 ఆన్ లైన్ పోల్ ని వక్రీకరించేందుకు‘నమస్తే’ ప్రయత్నం
  • V6 ఆన్ లైన్ పోల్ ను మానిప్యులేట్ చేసే ప్రయత్నం
  • 60 వేల ఓట్లొచ్చిన యూట్యూబ్ పోల్ ను చూసుకోని గులాబీ పెయిడ్ బ్యాచ్
  • బీజేపీ గెలిస్తే ఎట్లాంటి సమస్య రాదన్న 72 శాతం మంది
  • ఇది చూసుకోకుండానే నమస్తే తెలంగాణ పత్రికలో అబద్ధపు రాతలు
  • కేవలం స్క్రీన్​షాట్లతో జనం ఆలోచనలను మార్చలేరన్నది తెలుసుకోలేని దుస్థితి

హైదరాబాద్, వెలుగు‘నమస్తే తెలంగాణ’ సోషల్ మీడియా గురించి చారణా కూడా అవగాహన లేకుండా V6 ఆన్ లైన్ పోల్ ని వక్రీకరించే ప్రయత్నం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ఎదుర్కొంటున్న తీవ్ర వ్యతిరేకతను దాచిపెట్టడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల సందర్భంగా సిటీ అంశాలు, జనం సమస్యలపై V6 న్యూస్ పలు ప్లాట్ ఫాంలతో ఆన్ లైన్ పోల్స్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇటీవల కేసీఆర్, కేటీఆర్ చేసిన కామెంట్ల ఆధారంగా ‘గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందా?’ అన్న ప్రశ్నతో పోల్ నిర్వహించింది. యూట్యూబ్ లో, ట్విట్టర్ లో 24 గంటల పాటు ఓటు రికార్డు చేసేలా ఈ పోల్ జరుగుతుంది. V6 సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే లక్షలాది మంది నిజాయతీగా వాళ్ల అభిప్రాయాలను పంచుకుంటారు. అయితే మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రశ్నను ఉంచిన కాసేపటికే.. టీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ లకు చెందిన కొందరు వారి వాట్సాప్ గ్రూపుల్లో V6 ట్విట్టర్ పోల్ లింక్ ను సర్క్యులేట్ చేశారు. తమ అనుచరులతో కావాలని ఓట్లేయించి పోల్ ను మానిప్యులేట్ చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు V6 సోషల్ మీడియా టీంకి అందడంతో రెండు గంటల్లోనే పోల్ ను నిలిపేసింది. నిజమైన ఫాలోయర్స్ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాలన్నదే V6 పోల్ ఉద్దేశం. ఈ ట్విట్టర్ పోల్ ను నిలిపేసినప్పటికి 1,250 మంది మాత్రమే ఓటేసిన స్క్రీన్ షాట్ ను గులాబీ పెయిడ్ బ్యాచ్ లు సర్క్యులేట్ చేశాయి. V6 లోగో చూసిన కొందరు నిజమే అనుకుంటే.. గులాబీ గ్రూపుల్లో రావడంతో చాలామంది వాస్తవం ఏమిటని ఆరా తీశారు. మరోవైపు అసలైన ఆన్ లైన్ పోల్ V6 యూట్యూబ్ ఫ్లాట్ ఫాంపై 24 గంటల పాటు కొనసాగింది. 60 వేల మందికిపైగా ఓట్లేశారు. అందులో 72 శాతం మంది హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా ఎలాంటి సమస్య రాదని తేల్చిచెప్పారు. 28 శాతం మంది మాత్రం సమస్య ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ యూట్యూబ్​ పోల్ గురించి అవగాహన లేని గులాబీ బ్యాచ్.. తాము ప్రమోట్ చేసుకున్న 1,250 ఓట్ల ట్విట్టర్ పోల్ నే నిజమనుకుంది. దీన్నే ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వార్తగా రాసుకుంది. అసలు సోషల్ మీడియా అంటేనే మండిపడుతూ.. యాంటీ సోషల్ మీడియా అంటూ విరుచుకుపడే సీఎం కేసీఆర్ ను అదే సోషల్ మీడియా సమర్థిస్తోందని అందులో చెప్పుకోవడం విశేషం.

ఒకట్రెండు కాదు.. వందల్లోనే కామెంట్లు

V6 ఆన్ లైన్ పోల్ కామెంట్లలో ఒకట్రెండు మాత్రమే కేసీఆర్ ను సమర్థిస్తూ వస్తే.. అందరూ అదే అభిప్రాయం చెప్పారన్నట్టుగా ‘నమస్తే తెలంగాణ’ పత్రిక రాసుకుంది. ఆన్ లైన్ పోల్ లో జనం వందలాది కామెంట్లు పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్​లో బీజేపీ గెలిస్తే.. సిటీలో కంటే కేసీఆర్ ఫ్యామిలీలో, ఫాంహౌస్ లో శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ చాలా మంది సెటైర్లు వేశారు. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య ఉందా’ అని చాలామంది నిలదీశారు. ‘బీజేపీ కంటే ఎంఐఎం వల్లే సమస్య వస్తుంది’ అని మరికొందరు, ‘బీజేపీ గెలిస్తే కేసీఆరే శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రమాదం ఉంది’ అని ఇంకొందరు కామెంట్ చేశారు. ‘కేసీఆర్ పాలనలోనే బైంసా, కరీంనగర్ లో మత ఘర్షణలు జరిగాయి’ అని కొందరు గుర్తు చేశారు. ఆన్​లైన్​ పోల్ లో జనం కామెంట్లను V6 యూట్యూబ్ కమ్యూనిటీ ఫ్లాట్ ఫాంలోకి వెళ్లి ఎవరైనా చదువుకోవచ్చు. గులాబీ పెయిడ్ బ్యాచ్ తోపాటు మరెవరైనా సరే ఫేక్ ఐడీలతో కామెంట్లు, ఓట్లను మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తే.. V6 సోషల్ మీడియా టీమ్ ఎప్పటికప్పుడు గుర్తించి ఏరిపారేస్తుంది. ఎవరికి అనుకూలం, వ్యతిరేకమైనా సరే నిజాయతీగా అభిప్రాయం, విమర్శ చేసినా V6 గౌరవిస్తుంది.