కోవర్ట్ ఆపరేషనా ? నంబాల ఎన్​కౌంటర్​పై అనుమానాలు..మూడంచెల రక్షణ వలయంలో పార్టీ చీఫ్  

కోవర్ట్ ఆపరేషనా ? నంబాల ఎన్​కౌంటర్​పై అనుమానాలు..మూడంచెల రక్షణ వలయంలో పార్టీ చీఫ్  
  • వృద్ధాప్య సమస్యల వల్ల కొంతకాలంగా షెల్టర్  జోన్​లో కేశవరావు
  • ఎదురుకాల్పుల్లో చంపడం అసాధ్యమంటున్న  ఎక్స్​పర్ట్స్​
  • ఒడిశాలో ఆసుపత్రి నుంచి పట్టుకొచ్చి చంపారనే వార్తలు
  • మావోయిస్టు పార్టీ నుంచి ప్రకటన వస్తేనే మరింత స్పష్టత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మూడంచెల రక్షణ వలయంలో .. సుశిక్షుతులైన అంగరక్షకుల పహారాలో ఉండే మావోయిస్టు దళపతి నంబాల కేశవ రావు ఎన్​కౌంటర్​పై అనుమానాలు వ్యక్తమవున్నాయి. ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్​ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల చనిపోయారని భద్రతా బలగాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, ఆ స్థాయి లీడర్​ను ఎదురుకాల్పుల్లో చంపడం అసాధ్యమని,  వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నంబాల అసలు అడవుల్లో దళాల మధ్య ఉండే చాన్సే​లేదని, చాలా కాలంగా ఆయన షెల్టర్​జోన్​లో ఉంటున్నారని మాజీ మావోయిస్టులు, పార్టీ సానుభూతిపరులు చెబుతున్నారు. కాగా, కోవర్ట్​ ఆపరేషన్ ఫలితంగా ఈ ఎన్​కౌంటర్​ జరిగిందనే ప్రచారం జోరందుకుంది. నిఘా వర్గాలు పక్కా స్కెచ్ వేసి .. ఒడిశాలో హెల్త్​ చెకప్  కోసం వెళ్లిన నంబాలను పట్టుకొచ్చి హతమార్చారనే వార్తలు వస్తున్నాయి.

కోవర్ట్​ ఆపరేషన్​ ?

నంబాల కేశవరావు ఎన్​కౌంటర్​ మావోయిస్ట్​ ప్రభావిత ప్రాంతాలతో పాటు దేశమంతటా హాట్​ టాపిక్​గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏకే 47, ఎస్ఎల్ఆర్​ వంటి అత్యాయుధునిక ఆయుధాలతో 15 నుంచి 20 మంది మిలటరీ ట్రైనింగ్​ పొందిన అంగరక్షకులు నంబాలకు రక్షణ కల్పిస్తుంటారు. ఆపరేషన్​ కగార్​ నేపథ్యంలో ఆయన భద్రతను మరింత పెంచారని, ఏకంగా ఒక ప్లాటూన్​ ఆయనకు రక్షణగా ఉంటుందని చెప్తున్నారు.

పోలీసులు, భద్రతాదళాలు ఆకస్మికంగా దాడి చేసినా పార్టీ చీఫ్​ను సురక్షితంగా తప్పించేందుకు అంగరక్షకులు ముందుగానే ప్లాన్​ సిద్ధం చేసుకుంటారని, ఎదురుకాల్పుల్లో సుప్రీం కమాండర్  హతం కావడం అంత సులభం కాదన్న వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో షెల్టర్​ జోన్​లో ఉంటున్న నంబాల హెల్త్​ చెకప్  కోసం ఒడిశాలోని ఓ హాస్పిటల్​కు వెళ్లిన సమయంలో ఆయనను పట్టుకున్నట్టు తెలుస్తోంది.

అటవీప్రాంతానికి బయట ఉండడం వల్ల ఆయనకు పెద్దగా భద్రత లేదని చెప్తున్నారు. మావోయిస్టు కీలక నేత ట్రీట్మెంట్​తీసుకుంటున్నారన్న సమాచారం రావడంతో భద్రతాబలగాలు నిఘాను పటిష్టం చేయడంతోపాటు.. కోవర్ట్​లను రంగంలోకి దింపినట్టు పార్టీ సానుభూతిపరులు అంటున్నారు. కోవర్టుల ద్వారా చికిత్స తీసుకుంటున్నది నంబాలగా నిర్ధారించుకున్న పోలీసులు ఆయనతో పాటు నలుగురైదుగురు అంగరక్షకులను, కొందరు సానుభూతిపరులను పట్టుకొచ్చి ఇంద్రావతి రివర్​ ఫారెస్ట్​లో కాల్చి చంపినట్టు ప్రచారం సాగుతోంది.

గతంలోనే కోవర్ట్​ ఆపరేషన్లలో మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలను కోల్పోయింది. నంబాలను పట్టుకోవడానికి పోలీసులు ఈ మధ్య కాలంలో లొంగిపోయిన వారిని, అరెస్టు అయిన వారిని కోవర్ట్​లుగా మార్చినట్టు తెలుస్తోంది. ఇటీవల చేపట్టిన కర్రెగుట్టల ఆపరేషన్​ కూడా పోలీసులకు కలిసివచ్చింది. సేఫ్​ జోన్​గా ఉన్న ఈ గుట్టల నుంచి మావోయిస్టులు చెల్లాచెదురుగా వెళ్లిపోయారు. ఈ క్రమంలో కీలక నేతలకు కొరియర్లుగా పని చేస్తున్న పలువురిని పోలీస్  బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి ద్వారా కీలకనేతల కదలికపై ఫోకస్​ పెట్టారు. 

 హిడ్మాపై గురిపెట్టి ..నంబాలను కాల్చిన్రు..

మోస్ట్​ వాంటెడ్​మావోయిస్ట్​ నేత హిడ్మా టార్గెట్​గా చాలాకాలంగా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్​చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ, ఛత్తీస్​గఢ్  సరిహద్దులను జల్లెడ పడ్తున్నారు. కర్రెగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నారని, అందులో హిడ్మా కూడా ఉన్నాడని ప్రచారం జరగడంతో వేలాది మంది పోలీసులు, పారా మిలటరీ బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. అంతకుముందే హిడ్మా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లడంతో పోలీసులు నిరాశచెందారు. దీంతో పార్టీకి సంబంధించిన పెద్ద నేతల ఆచూకీ కోసం భారీ కసరత్తు చేశారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే పోలీసులకు నంబాల సమాచారం తెలిసినట్టు అనుమానిస్తున్నారు.

నంబాలతో పాటు ఎన్​కౌంటర్​లో చనిపోయిన వారిలో దాదాపు 20 మంది  ఆదివాసీలేనని తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఇది పక్కా ఎన్​కౌంటర్​ అని పేర్కొంటున్నారు. నంబాల ఎన్​కౌంటర్​తో ఛత్తీస్​గఢ్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్​ పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై నిఘా పెట్టారు. ఛత్తీస్​ గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ముమ్మరంగా కూంబింగ్​ నిర్వహిస్తున్నారు.

మావోయిస్టు పార్టీ టార్గెట్​లో ఉన్న నేతలను అప్రమత్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించే టైంలో తప్పకుండా తమకు సమాచారం ఇవ్వాలని నేతలకు సూచిస్తున్నారు. కాగా, తమ పార్టీ చీఫ్​ఎన్​కౌంటర్​పై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రకటన వస్తే ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుందని మావోయిస్టు సానుభూతిపరులు  చెప్తున్నారు.