ఆకాశాన్ని నేలకు దించుతున్నరు

ఆకాశాన్ని నేలకు దించుతున్నరు

రమాశిష్, పాల్ శావియో.. కెరీర్ పరంగా వీళ్లిద్దరివి వేర్వేరు దారులు.  కానీ ఇద్దరికీ ఉన్న కామన్ ఇంట్రెస్ట్ ఆస్ట్రానమీ. ఒకరికి డాబా మీద పడుకుని నక్షత్రాలను చూడడం ఇష్టమైతే.. మరొకరికి ప్లానెటోరియంకు వెళ్లి పాలపుంతను ఫొటోలు తీయడం ఇష్టం. అనుకోకుండా ఒకసారి వీళ్లిద్దరూ కలిసారు. అప్పుడే వాళ్లకో ఐడియా వచ్చింది.  వాళ్లు ఇష్టపడే ఆస్ట్రానమీని అందరికీ పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అని.  ‘స్టార్‌‌‌‌స్కేప్స్‌‌’ పేరుతో దేశంలో ఎప్పుడూ లేని విధంగా చెయిన్ అబ్జర్వేటరీలు ఏర్పాటుచేయడం మొదలు పెట్టారు. దేశవ్యాప్తంగా ఆస్ట్రో టూరిజంకు  వన్ స్టాప్ డెస్టినేషన్స్‌‌ను ఏర్పాటుచేస్తున్నారు.

ఢిల్లీకి చెందిన రమాశిష్‌‌కు చిన్నప్పటి నుంచీ ఆస్ట్రానమీ అంటే ఇష్టం ఉండేది. రోజూ ప్లానెటోరియంకు వెళ్లి నక్షత్రాలను ఫొటోలు తీయనిదే నిద్రపోయేవాడు కాదు.  చదువుకునే రోజుల్లో నాసా, ఇస్రో ఏర్పాటుచేసే ఆస్ట్రో ఈవెంట్లలో పాల్గొనే వాడు.  అయితే ఆస్ట్రానమీపై అతనికున్న ఇష్టం కేవలం హాబీ వరకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత పైచదువులు పూర్తి చేసి నోకియా, శాంసంగ్ లాంటి కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశాడు. అప్పుడే తనకు బెంగళూరుకి చెందిన పాల్ పరిచయమయ్యాడు. అతనికి కూడా ఆస్ట్రానమీ అంటే ఇంట్రెస్ట్. ఇద్దరూ గంటల తరబడి చర్చించుకునే వాళ్లు. చివరిగా దేశంలో ఇప్పటివరకూ లేని ఒక కొత్త మోడల్‌‌ను స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. నక్షత్రాలను చూడాలనుకునే వాళ్లకోసం, ఆస్ట్రో టూర్లు చేసేవాళ్ల కోసం  ‘స్టార్ స్కేప్స్’ పేరుతో  దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల అబ్జర్వేటరీస్ ఏర్పాటు చేస్తున్నారు. 

రియల్ టైం ఎక్స్‌‌పీరియెన్స్
రమాశిష్, పాల్‌‌లు కలిసి 2016 లో మొదటి  ‘స్టార్‌‌‌‌స్కేప్స్’ అబ్జర్వేటరీని ఉత్తరాఖండ్‌‌లోని కౌసానీలో ఏర్పాటుచేశారు. ఆ తర్వాత కొన్నేండ్లలోనే ఊటీ, భింతల్, జైపూర్, కూర్గ్‌‌లో కూడా అబ్జర్వేటరీలు పెట్టారు. ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలను చూడాలనుకునే వాళ్లు ఇక్కడికి వస్తుంటారు. స్టార్‌‌‌‌స్కేప్స్ అబ్జర్వేటరీలు మొదలైన తర్వాత దేశంలో ఆస్ట్రో టూరిజం పెరిగిందని రమాశిష్, పాల్‌‌ చెప్తున్నారు. “దేశంలో చాల చోట్ల అబ్జర్వేటరీలు, ప్లానెటోరియంలు ఉన్నాయి. కానీ అవేవీ 
రియల్ టైం ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందించవు. కేవలం టెలిస్కోప్ రికార్డింగ్స్‌‌ మాత్రమే  చూపిస్తాయి. పైగా వాటిని విజిట్ చేయడానికి టైం లిమిట్ ఉంటుంది.  కొంతసేపు మాత్రమే చూడనిస్తారు. ఆస్ట్రానమీని ఎక్స్‌‌ప్లోర్ చేయాలను కునే వాళ్లకు మనదేశంలో సరైన ఏర్పాట్లు లేవు. ఈ లోటునే మేము పూడ్చాలనుకున్నాం. అందుకే ఆస్ట్రో టూరిజంను ఇష్టపడేవాళ్ల కోసం దేశంలోని ప్రతీ మూల అబ్జర్వేటరీలు ఏర్పాటు చేస్తున్నాం.

పగటిపూట కూడా..
స్టార్‌‌‌‌స్కేప్స్ అబ్జర్వేటరీల్లో ప్రతి సాయంత్రం ఆస్ట్రో  షోలు ఉంటాయి. టెలిస్కోప్​తో రాత్రంతా ఆకాశాన్ని చూడొచ్చు. ఆకాశంలో కనిపించే  వస్తువులు, గ్రహాలు, వాటి కదలికలను స్టడీ చేయొచ్చు. ఇక్కడుండే  పరికరాలతో చంద్రుడు, గ్రహాలు, గెలాక్సీలు, తోక చుక్కలు, నక్షత్రాల గుంపులను గమనించొచ్చు.  అలాగే ఇక్కడి లేటెస్ట్ ఎక్విప్‌‌మెంట్ సాయంతో పగటి పూట కూడా ఆకాశపు లోతుల్లోకి చూడొచ్చు. కొన్ని ప్రత్యేకమైన ఫిల్టర్ల ద్వారా సూర్యుని పైభాగాన్ని కూడా స్టడీ చేయొచ్చు”.  వీటితో పాటు ‘స్టార్‌‌‌‌స్కేప్స్’  ద్వారా స్కూల్, కాలేజీ స్టూడెంట్స్‌‌కు ఆస్ట్రానమీ ప్రోగ్రామ్స్, వర్క్‌‌షాప్స్ కండక్ట్ చేస్తున్నారు.  పిల్లలను అబ్జర్వేటరీకి తీసుకొచ్చి లేదా స్కూల్‌‌కే ఎక్విప్‌‌మెంట్ తీసుకొచ్చి ఆస్ట్రానమీని ఎలా స్టడీ చేయాలో లైవ్ ఎక్స్‌‌పీరియెన్స్ ద్వారా చెప్తారు. ఆస్ట్రానమీ గురించి పిల్లలలో ఇంట్రెస్ట్‌‌ను పెంచేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు ఈ ఇద్దరు.

స్పెషల్ ఫోకస్ పెట్టాం
“ప్రపంచమంతా ఆకాశాన్ని స్టడీ చేయడంలో బిజీగా ఉంది. కానీ మనదేశంలోని యూత్‌‌కు ఆస్ట్రానమీ గురించి అవేర్‌‌‌‌నెస్ తక్కువ. చిన్నప్పుడు డాబాపై పడుకుని నక్షత్రాలను చూసేవాళ్లం. ఇప్పుడు అలాంటి రోజులు లేవు. చూద్దామన్నా లైట్ పొల్యూషన్ కారణంగా నక్షత్రాలు కనిపించవు. అలాగే మనదేశంలో ఆస్ట్రానమీని ఎక్స్‌‌ప్లోర్ చేయాలనుకునే వాళ్లకు తగిన ఎక్విప్‌‌మెంట్, సౌకర్యాలు  లేవు. అందుకే దీనిపై మేం స్పెషల్ ఫోకస్ పెట్టాం. నక్షత్రాలను చూసి ఆనందించాలను కునే వాళ్లకి, వాటిని స్టడీ చేసేవాళ్లకు, ఫొటోగ్రఫీ చేసేవాళ్లకు ఎక్విప్‌‌మెంట్ అందిస్తున్నాం. వాటిపై నాలెడ్జ్ పెరిగేలా వర్క్‌‌షాప్‌‌లు నిర్వహిస్తున్నాం. రాత్రిళ్లు ఆకాశంలో నక్షత్రాలను, పాలపుంతను చూసేందుకు చాలామంది టూర్లు వెళ్తుంటారు. దీన్నే ఆస్ట్రో టూరిజం అంటారు. నక్షత్రాలు, పాలపుంతను నేరుగా చూడాలంటే  ఎంతో ఎత్తైన, చీకటితో నిండిన ప్రాంతాలకు వెళ్లాలి. మనదేశంలో అలాంటి ప్రాంతాలు చాలా తక్కువ. అందుకే ఇక్కడ ఆస్ట్రో టూరిజం అంతగా డెవలప్ అవ్వలేదు. కానీ స్టార్‌‌‌‌స్కేప్స్‌‌ అబ్జర్వేటరీలు పెరిగాక ఆస్ట్రో టూరిజం ట్రెండ్ కాస్త పెరిగింది. ప్రతి నెలా పదుల సంఖ్యలో ఆస్ట్రో టూర్ల కోసం మా దగ్గరకు వస్తున్నారు.  ఎత్తైన హిల్ స్టేషన్స్‌‌లో ఉన్న మా అబ్జర్వేటరీల నుంచి స్టార్‌‌‌‌గేజింగ్ ఎక్స్‌‌పీరియెన్స్  కొత్తగా ఉంటుంది. త్వరలో ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కలిసి చమోలి జిల్లాలోని బెనిటల్‌‌లో ఆస్ట్రో-విలేజ్ నిర్మించ బోతున్నాం.  ఇది దేశంలో మొట్టమొదటి ఆస్ట్రో-టూరిజం స్పాట్‌‌’’