ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల పోలీసు కస్టడీ

ఐబొమ్మ రవికి మరో  మూడు రోజుల పోలీసు కస్టడీ
  • బెయిల్​ పిటిషన్​పై విచారణ వాయిదా

బషీర్​బాగ్, వెలుగు: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని మరో మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. రవిని ఇప్పటికే  రెండు విడతల్లో 8 రోజులు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు..అతని నుంచి మరింత సమాచారం, ఆధారాలు సేకరించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. అంతకుముందు రవి బెయిల్ పిటిషన్‌‌పై జరగాల్సిన విచారణ, తాజా కస్టడీ అనుమతుల కారణంగా వచ్చే సోమవారానికి వాయిదా పడింది. 

కోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం చంచల్‌‌గూడ జైలు నుంచి రవిని పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. ఇప్పటి వరకు రవిపై ఐదు కేసులు నమోదు కాగా , మొదటి కేసులో 8 రోజుల కస్టడీలో నెట్​వర్క్, ఆర్థిక లావాదేవీలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీశారు. ఐపీలను మాస్క్ చేసి నడుపుతున్న అనధికారిక వెబ్‌‌సైట్లు, పోర్న్ ప్లాట్‌‌ఫాంలు, పైరసీ వీడియోలను అప్‌‌లోడ్ చేసే ముఠాల కార్యకలాపాలపై రవిని ప్రశ్నించినట్లు సమాచారం. ఇక మూడు రోజుల పాటు కస్టడీ నేపథ్యంలో  పైరసీ కేసులో మరింత సమాచారాన్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.