- పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ షాప్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా విస్మరించడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యాపారాలు నిర్వహించడం నేరమని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని స్పష్టం చేశారు. సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలు, సంస్థలు ఎక్కడైనా ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
