పాఠశాల కమిషనర్ ఆఫీసు ముట్డడికి టీచర్ల యత్నం

పాఠశాల కమిషనర్ ఆఫీసు ముట్డడికి టీచర్ల యత్నం

హైదరాబాద్ : లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించారు. తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులు నిరసనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయమే లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి వస్తుండగా.. సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలియజేసే హక్కు లేకుండా చేస్తున్నారని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేవలం తమ సమస్యల కోసమే నిరసనకు ప్రయత్నించలేదని.. విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతో మంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని.. అందుకే తాము  కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ టీచర్ల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బోధన, బోధనేతర సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వారితోపాటు ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న మరికొందరిని  పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు  తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అక్రమంగా అరెస్ట్ చేశారని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడ్డారు.