2025 Padma Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా.. పద్మభూషణ్ అవార్డు అందుకున్న హీరో బాలకృష్ణ

2025 Padma Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా..  పద్మభూషణ్ అవార్డు అందుకున్న హీరో బాలకృష్ణ

2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు సోమవారం (ఏప్రిల్ 28న) పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పలు రంగాల్లో విశేష కృషిని అందించిన కళాకారులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులని అందించింది కేంద్రం.

ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ నుండి హీరో నందమూరి బాలకృష్ణకి కేంద్రం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మభూషణ్' పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. కళారంగంలో, సామాజిక సేవలకు గాను బాలకృష్ణకు పద్మభూషణ్ పుసరస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు.  

ఐదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో వెండితెరపై విభిన్న పాత్రలు పోషించాడు బాలకృష్ణ. ఆయన సినీ కెరీర్‌లో, 110 చిత్రాలలో, ఆయన తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అంతేకాకుండా హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులతో పాటుగా, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, కూతురు తేజస్విని ఆయన భార్య వసుందర పాల్గొన్నారు.

2025 గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 25న పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు వరించాయి. అందులో 113 పద్మశ్రీ, 19 పద్మభూషణ్, ఏడు పద్మవిభూషణ్ పురస్కారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణకు దక్కింది.

సినీ విభాగంలో మరికొంత మందికి:

టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ శోభనకి కూడా పద్మభూషణ్‌ అవార్డు లభించింది. నటి శోభన హీరోయిన్గా మాత్రమే కాకుండా భరతనాట్యం డ్యాన్సర్గా పలు ప్రదర్శనలు ఇచ్చింది. తమిళ్ హీరో అజిత్ కుమార్కి పద్మభూషణ్‌ అవార్డు వరించింది. కర్ణాటక నుంచి కేజీయఫ్ మూవీ ఫేమ్ నటుడు, రైటర్ అనంత్ నాగ్కి పద్మభూషణ్‌ అవార్డు లభించింది. ఇక బాలీవుడ్ నుంచి అరజిత్ సింగ్ (పద్మశ్రీ), శేఖర్ కపూర్ (పద్మభూషణ్‌) తదితరులకి అవార్డులు లభించింది.