ఎన్టీఆర్కు మరణం లేదు..బాలకృష్ణ భావోద్వేగం

ఎన్టీఆర్కు మరణం లేదు..బాలకృష్ణ భావోద్వేగం

పేద ప్రజల ఆకలి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీని స్థాపించి..రాజకీయ విప్లవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సాహసోపేతమైన పథకాలు అమలు చేశారన్నారు.  హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోతవ్సవ సభలో బాలకృష్ణ పాల్గొన్నారు.

ప్రతి తెలుగువాడు సగర్వంగా తలఎత్తుకునేలా ఎన్టీఆర్ చేశారని బాలకృష్ణ అన్నారు. తెలుగు ప్రజల భవిష్యత్ కు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. నవజాతికి ఎన్టీఆర్‌ మార్గదర్శకమన్నారు. యువతకు ఆదర్శమన్నారు. ఆ మహానుబావుడికి మరణం లేదని చెప్పారు. నిత్యం వెలిగే మహోన్నత దీపమని అన్నారు. 

టీడీపీ హయాంలో ఎన్టీఆర్ ఇండ్లు లేని పేదలకు ఇండ్లు కట్టించారని..తెలంగాణలో పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని బాలకృష్ణ గుర్తు చేశారు. ప్రజల వద్దకే పాలనను తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచి..వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. గురుకుల విద్యా బోధన, సంక్షేమ హాస్టళ్లను ఎన్టీఆరే  తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైసీపీ  ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.