కుటుంబం ఆత్మహత్య కేసు వ్యవహారంలో నంద్యాల సీఐ అరెస్ట్‌

కుటుంబం ఆత్మహత్య కేసు వ్యవహారంలో నంద్యాల సీఐ అరెస్ట్‌

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే సీఐను సస్పెండ్‌ చేయగా.. తాజాగా ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు డీఐజీ వెంకట్రామిరెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలన్న సీఎం జగన్‌ ఆదేశాల నేపథ్యంలో ఐజీ శంకబ్రత బాగ్చి నంద్యాల చేరుకుని విచారణ చేపట్టారు. కొంతమంది కానిస్టేబుళ్లను ఆయన ప్రశ్నించారు. అబ్దుల్‌ సలాం ఆటోలో నగదు పోయినట్లు ఫిర్యాదు చేసిన భాస్కర్‌రెడ్డిని కూడా పోలీసులు ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి పిలిపించి వివిధ అంశాలపై ఆరా తీశారు.

ఇటీవల కర్నూలు జిల్లా కౌలూరు వద్ద అబ్దుల్‌సలాం కుటుంబం రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తప్పుడు కేసు పెట్టారంటూ అబ్దుల్‌ తీసుకున్న సెల్ఫీ వీడియో నిన్న రాత్రి వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం బంగారం దుకాణంలో చోరీ కేసులో అబ్దుల్‌ సలాంను నిందితుడిగా చేర్చారు. తాను చేయని దొంగతనం కేసులో తనపై ఒత్తిడి పెంచుతున్నారని.. అది భరించలేకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో అబ్దుల్‌సలాం చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విచారణ పూర్తయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను సస్పెండ్‌ చేసిన పోలీసు శాఖ.. తాజాగా ఆయనతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేసింది.