ఆరు నెలల్లో సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా : లోకేష్

ఆరు నెలల్లో సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా : లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని, సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అని లోకేశ్ తేల్చి చెప్పారు.  కొన్నిరోజులుగా ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్.. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం, ఏపీలో పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు.లోకేష్ వెంట కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు.  జగన్ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. 

యువగళం పాదయాత్ర మళ్లీ మొదలు పెడతామని చెప్పినందుకే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నన్ను ఏ-14గా చేర్చారని లోకేశ్ ధ్వజమెత్తారు.  మా పోరాటం ఆగదని, మా పోరాటాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళతామని లోకేశ్ చెప్పారు.   తాను ఢిల్లీలో దాక్కున్నాన‌ని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, తనపై వైసీపీ పెట్టించిన త‌ప్పుడు కేసులో స‌త్తా ఉంటే ఢిల్లీ వ‌చ్చి అరెస్టు చేయొచ్చు క‌దా అని ప్రశ్నించారు.  అంటే కేసులో ఏమీ లేదని తేలిపోయిందన్నారు. కేసులో ఏదైనా ఉంటే ఎక్కడికైనా వెళ్లి అరెస్ట్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది కదా అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసులతో నాకు సంబంధమే లేదని లోకేశ్ తేల్చి చెప్పారు.భవిష్యత్తుకు గ్యారెంటీ, యువగళం, వారాహి యాత్రలకు ప్రభుత్వం భయపడుతోందని, మాపై దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని లోకేశ్ ధ్వజమెత్తారు.