ఎమ్మెల్యేల పిల్లలు సర్కారు స్కూళ్లలో చదివేలా చట్టం చేయాలె: నారగోని ప్రవీణ్ కుమార్

ఎమ్మెల్యేల పిల్లలు సర్కారు స్కూళ్లలో చదివేలా చట్టం చేయాలె: నారగోని ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ స్కూళ్లలోనే చదవాలనే చట్టం తీసుకురావాలని ఉచిత విద్య, వైద్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అప్పుడే సర్కారు విద్య బాగుపడుతుందని ఒక ప్రకటనలో  తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నదని నారగోని ఆరోపించారు. కార్పొరేట్ స్కూళ్లకు సర్కారు పరోక్షంగా సహాయపడుతున్నదని విమర్శించారు. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు, యూనిఫామ్స్ ఇవ్వడం లేదని, సర్కారు బడుల్లో అనేక సమస్యలున్నాయని చెప్పారు. బడుల్లో అటెండర్లు, స్వీపర్లు లేక పరిశుభ్రత లోపించిందన్నారు. స్టూడెంట్లు రోగాల పాలవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులతో పాటు ఎంఈవో పోస్టులనూ భర్తీ చేయాలని నారగోని డిమాండ్ చేశారు.