ఆర్టీసీ బస్సులో చైన్​స్నాచింగ్..ప్యాసింజర్ ఫిర్యాదుతో దొంగ అరెస్ట్

ఆర్టీసీ బస్సులో చైన్​స్నాచింగ్..ప్యాసింజర్ ఫిర్యాదుతో దొంగ అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: ఆర్టీసీ బస్సులో చైన్ స్నాచింగ్​కు పాల్పడ్డ దొంగను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చిన్నమంగళారం గ్రామానికి చెందిన బ్యాగరి పోచయ్య ఆర్టీసీ క్రాస్​రోడ్​లోని బీఎండబ్ల్యూ కార్ షోరూంలో హౌస్ కీపింగ్ సూపర్ వైజర్​గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం డ్యూటీకి బయలుదేరిన పోచయ్య  చిన్నమంగళారం నుంచి మెహిదీపట్నానికి వచ్చాడు. 

అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్​రోడ్​కు వెళ్లేందుకు ‘113ఎం’ బస్సు ఎక్కాడు. నారాయణగూడ బస్టాప్ వద్దకు రాగానే అతడి మెడలో ఉన్న 1.5 తులాల గోల్డ్​చైన్ కనిపించలేదు. బస్సులో నుంచి అనుమానాస్పదంగా కొందరు దిగిపోవడాన్ని గమనించిన పోచయ్య వెంటనే నారాయణగూడ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గోల్డ్ చైన్​ను కొట్టేసిన దొంగను గుర్తించారు. టప్పాచబుత్ర ఏరియాలో ఉండే పాత నేరస్తుడు మహ్మద్ సద్దాం(30) చైన్ స్నాచింగ్ చేసినట్లు తేల్చారు. గురువారం అతడిని ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. గోల్డ్​చైన్​ను రికవరీ చేశారు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.