మహబూబ్‌నగర్, వెలుగు: మక్తల్, -నారాయణపేట, -కొడంగల్ స్కీమ్‌లో భాగంగా జిల్లాలో గుర్తించిన గ్రామాల్లో భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం ఆమె ఆర్డీవో, సంబంధిత తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. రైతులకు అందజేసిన పరిహారం, అందజేయాల్సిన పరిహారం, సేకరించాల్సిన భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ ఓటరు దినోత్సవంపై సమావేశం నిర్వహించారు.
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న నిర్వహించే ర్యాలీని సక్సెస్ చేయాలని కోరారు. 25న ఆదివారం కావడంతో, ఈ నెల 23న జిల్లాలోని అన్ని విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించాలని ఆదేశించారు. అనంతరం తన చాంబర్లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యువతకు ఉచిత శిక్షణకు సంబంధించిన కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. మహబూబ్‌నగర్‌లోని ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్లో ఇచ్చే శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్డీవో రాంచందర్, ఏవో శ్రీధర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో రశీద్ పాల్గొన్నారు.
