- నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు : నారాయణపేట జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 15 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 8,192 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ఫర్నిచర్, పారిశుధ్యం లాంటి కనీస సౌకర్యాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను నడపాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించరాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, డీఐఈవో కన్వీనర్ సుదర్శన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
