- ఇక్కడి పోలీసులకూ అదే శిక్ష పడాలి
- నేరెళ్ల బాధితుడు కోల హరీశ్
తంగళ్లపల్లి, వెలుగు: తమిళనాడులో జరిగిన తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని నేరెళ్ల ఘటన బాధితుడు కోల హరీశ్ తెలిపారు. ఈ కేసులో తప్పు చేసిన పది మంది పోలీసులకు మరణశిక్ష విధించడం సముచితమేనని ఆయన పేర్కొన్నారు. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసిన అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటి, ఎస్సై రవీందర్‌తో పాటు సంబంధిత పోలీసులపై కూడా ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో వెలువడిన తీర్పు తమకు ధైర్యం నింపిందని, నేరెళ్ల బాధితులకు కూడా న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హరీశ్ తెలిపారు. అక్కడ బాధితులకు జరిగినట్లే తమకు కూడా న్యాయం జరగాలని ఆయన కోరారు.
పోలీసుల ముసుగులో కొందరు తీవ్ర అరాచకాలు చేస్తున్నారని, ఆ బాధ స్వయంగా తాము అనుభవించామన్నారు. తమిళనాడులో తండ్రీకొడుకులను చిత్రహింసలు పెట్టినట్లే.. తమపై కూడా కొందరు పోలీసులు అమానుషంగా వ్యవహరించారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నేరెళ్ల ఘటన కేసును సీబీఐకి అప్పగించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
