71 మందితో మోదీ కేబినెట్..31 మందికి కేబినెట్..ఐదుగురికి స్వతంత్ర్య హోదా

71 మందితో  మోదీ కేబినెట్..31 మందికి కేబినెట్..ఐదుగురికి స్వతంత్ర్య హోదా
  • తెలంగాణ నుంచి కిషన్​రెడ్డి, బండి సంజయ్​.. 
  • ఏపీ నుంచి రామ్మోహన్​, పెమ్మసాని, శ్రీనివాస వర్మ
  • ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం
  • 30 మందికి కేబినెట్, ఐదుగురికి స్వతంత్ర హోదా
  • సహాయ మంత్రులుగా 36 మందికి చాన్స్.. కేబినెట్​లో 
  • కొత్తగా 9 మందికి అవకాశంఓబీసీలకు 27, ఎస్సీలకు 10, మైనార్టీలకు 5, 
  • ఎస్టీలకు 5 పదవులు కేబినెట్ లో 8 మంది మహిళలకు చోటు.. 
  • కేరళ నుంచి సహాయ మంత్రిగా సురేశ్ గోపి ప్రమాణం 
  •  హాజరైన ఖర్గే, చంద్రబాబు, నితీశ్, పవన్ కల్యాణ్ 

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో తొలి సంకీర్ణ సర్కారు కొలువుదీరింది. దేశానికి 17వ ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆయన దైవసాక్షిగా హిందీలో ప్రమాణం చేశారు. దీంతో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన నేతగా మోదీ రికార్డ్ సృష్టించారు. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లాన్స్​లో ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం మూడు గంటలపాటు సాగింది. 

మోదీతోపాటు మరో 71 మందితో కేంద్రమంత్రులుగా ప్రెసిడెంట్ ముర్ము ప్రమాణం చేయించారు. తెలంగాణ నుంచి బండి సంజయ్ కి తొలిసారి కేంద్ర కేబినెట్​లో చోటు దక్కగా.. కిషన్ రెడ్డి మరోసారి కేబినెట్ ​మంత్రిగా ప్రమాణం చేశారు. ఇక ఏపీ నుంచి కూడా ముగ్గురు కేంద్ర మంత్రులుగా చాన్స్ దక్కించుకున్నారు. వీరిలో శ్రీకాకుళం నుంచి గెలిచిన రామ్మోహన్​ నాయుడు (36) కేబినెట్​లోనే అతి పిన్న వయస్కుడు. మోదీతో సహా మొత్తం 30 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఐదుగురు స్వతంత్ర హోదాలో, 36 మంది సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. 9 మంది కొత్తవారికి కేంద్ర మంత్రులుగా చాన్స్ దక్కింది. మంత్రివర్గంలో 8 మంది మహిళలకు చోటు కల్పించారు. వీరిలో నిర్మలా సీతారామన్, అన్నపూర్ణ దేవి కేబినెట్ మంత్రులుగా, మిగతా వారు సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రులుగా చాన్స్ దక్కినవారిలో రాజ్యసభ సభ్యులు 8 మందితోపాటు తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు నేతలు కూడా ఉన్నారు. ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులందరికీ శాఖలను తర్వాత కేటాయించనున్నారు. కేంద్రంలో పదేండ్ల యూపీఏ పాలన తర్వాత 2014లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాగా మోదీ తొలిసారిగా ప్రధాని అయ్యారు. 2019లో రెండోసారి కూడా సొంతంగానే మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈసారి మ్యాజిక్ ఫిగర్ (272)కు 32 సీట్ల దూరంలోనే బీజేపీ నిలిచిపోవడంతో ఎన్డీయే మిత్రపక్షాల మద్దతుతో తొలిసారి సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది.  

ఏపీ నుంచి ముగ్గురికి.. 

కేంద్ర కేబినెట్​లో ఏపీకి మూడు మంత్రి పదవులు దక్కాయి. కూటమిలో కీలకంగా మారిన టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి కేటాయించారు. టీడీపీ నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్  సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే బీజేపీ నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కింది. శ్రీనివాస్ వర్మ 1988 నుంచి బీజేపీలో యాక్టివ్ గా ఉన్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి జిల్లా యువమోర్చా చీఫ్ గా, మున్సిపల్ కౌన్సిలర్ గా, ఇన్ చార్జ్ చైర్మన్ గా పని చేశారు. అయితే సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన నేతకు మంత్రి పదవి ఇవ్వడంతో భవిష్యత్తులో ఏపీలోనూ పార్టీ విస్తరణకు దోహదపడుతుందని పార్టీ హైకమాండ్ భావించినట్లు తెలుస్తోంది. 

బీజేపీకి 61 మంత్రి పదవులు

కేంద్ర కేబినెట్ లో మోదీతోసహా మొత్తం 72 మంది మంత్రులు ఉండగా.. బీజేపీ నుంచి 61 మంది మంత్రులయ్యారు. టీడీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక జేడీఎస్, శివసేన, అప్నాదళ్, హెచ్ఏఎం, ఆర్పీఐ పార్టీలకు ఒక్కోటి చొప్పున మొత్తం 5 మంత్రి పదవులు దక్కాయి. 

చప్పట్లతో మారుమోగిన వేదిక 

మోదీ తర్వాత బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా వరుసగా రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత మిత్రపక్షాల నుంచి హెచ్ డీ కుమారస్వామి (జేడీఎస్), లలన్ సింగ్ (జేడీయూ) చేత రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. అనంతరం ఈశాన్య రాష్ట్రాల నుంచి శర్బానంద సోనోవాల్, కిరెన్ రిజిజు ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన బీజేపీ నేతల్లో జ్యోతిరాదిత్య సింధియా, హర్ దీప్ సింగ్ పురి కూడా ఉన్నారు. బిహార్ కు చెందిన ఎల్జేపీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రమాణం చేయడానికి లేచిన సందర్భంగా నేతలు, వారి మద్దతుదారులు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందనలు తెలిపారు. 

దాదాపు 9 వేల మంది హాజరు 

కేంద్ర కేబినెట్ ప్రమాణం సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి భవన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మోదీ ప్రమాణ స్వీకారానికి మిత్రపక్షాల నేతలు నితీశ్ కుమార్, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు, త్రిదండి చినజీయర్ స్వామి, ఇతర సాధువులు, ఫిల్మ్ స్టార్లు షారుఖ్ ఖాన్, బీజేపీ ఎంపీ, నటి కంగన రనౌత్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, రవీనా టాండన్, తదితరులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఇతర ఇండస్ట్రియలిస్టులు కూడా అటెండ్ అయ్యారు. దాదాపు 9 వేల మంది ప్రేక్షకులు రాష్ట్రపతి భవన్ వద్ద కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. 

కాంగ్రెస్ చీఫ్ ఖర్గే హాజరు

మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఒక్కరే హాజరయ్యారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకు కూడా రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానాలు వెళ్లినా.. ఖర్గే మినహా మిగతా వారెవరూ కార్యక్రమానికి హాజరుకాలేదు. మోదీ ప్రమాణ స్వీకారానికి తాము హాజరుకాబోమని లెఫ్ట్ నేతలు సీతారాం యేచూరి, డి. రాజా ముందుగానే ప్రకటించారు. అలాగే టీఎంసీ నేత సాగరిక ఘోష్ తనకు అందిన ఇన్విటేషన్ లెటర్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రజా తీర్పులో ఓడిపోయిన మోదీ ప్రమాణ స్వీకారానికి చట్టబద్ధత లేదని, అందుకే తాను ఆ కార్యక్రమానికి వెళ్లబోనని తెలిపారు. అయితే, మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానాలు అందలేదని, తమ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ కూడా ఆ కార్యక్రమానికి ఎవరూ వెళ్లరాదని ఆదేశించారని మరో టీఎంసీ నేత తెలిపారు. 

వైట్ కుర్తా.. బ్లూ జాకెట్ లో మెరిసిన మోదీ 

ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ వైట్ కుర్తా పైజామా.. బ్లూ చెక్స్ తో కూడిన జాకెట్, బ్లాక్ షూస్ ధరించారు. మోదీ తొలిసారిగా 2014లో ప్రధానిగా ప్రమాణం చేసిన సందర్భంగా క్రీమ్ కలర్ కుర్తా పైజామా, గోల్డ్ కలర్ జాకెట్ వేసుకున్నారు. రెండోసారి 2019లో పీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా వైట్ కుర్తా పైజామా, క్రీమ్ కలర్ జాకెట్ ధరించారు. ముఖ్యమైన సందర్భాల్లో మోదీ ఎక్కువగా కుర్తా, బంధ్ గాలా జాకెట్లు వేసుకుంటుంటారు. రిపబ్లిక్ డే, పంద్రాగస్టు వంటి సందర్భాల్లో కలర్ ఫుల్ తలపాగాలు కూడా ఆయన ధరిస్తుంటారు.  

తెలంగాణకు రెండు పదవులు 

కేంద్ర కేబినెట్​లో తెలంగాణకు రెండు మంత్రి పదవులు దక్కాయి. కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో తొలి రెండున్నరేండ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, తర్వాత కేబినెట్ హోదాలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి హైకమాండ్ దృష్టిలో పడిన బండి సంజయ్​కు తొలిసారి కేంద్ర కేబినెట్​లో బెర్త్ దక్కింది. తొలిసారి 2019లో ఎంపీగా గెలిచిన సంజయ్​కు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఆ తర్వాత పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా నియమించింది. తాజా ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఆయన రెండోసారి ఎంపీగా గెలిచారు. దీంతో రాష్ట్రానికి ఇచ్చే రెండో మంత్రి పదవి కోటాలో హైకమాండ్ ఆయనకు అవకాశం కల్పించింది. 

రాష్ట్రాల వారీగా ఇలా.. 

యూపీకి 6 (ప్రధానితో సహా),  మధ్య ప్రదేశ్​కు 5, బిహార్​కు 5(మిత్రపక్షాలతో సహా), రాజస్థాన్​కు 5, గుజరాత్, మహారాష్ట్రకు చెరో 4, ఏపీకి 3 (టీడీపీ2, బీజేపీ1), కర్నాటక, ఒడిశాకు 3 చొప్పున, తెలంగాణ, జార్ఖండ్, హర్యానాకు 2 చొప్పున, ఢిల్లీ, గోవా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్​గఢ్​కు ఒక్కో మంత్రి పదవిని కేటాయించారు. త్రిసూర్ నుంచి గెలిచి కేరళలో పార్టీకి తొలిసారి ప్రాతినిధ్యం దక్కేలా చేసిన సురేశ్ గోపికి, పార్టీ విధేయుడు జార్జ్ కురియన్​కు సహాయ మంత్రి పదవులు దక్కాయి. 

పాలనపై దృష్టి పెట్టండి: కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం 

కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆదివారం ఉదయం ప్రధాని మోదీ తన నివాసంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న కొత్త, సీనియర్ నేతలకు తేనీటి విందు ఇచ్చారు. కొత్త ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ లక్ష్యాలను వారికి వివరించారు. కలిసికట్టుగా ప్రజలకు మరింత సేవ చేసే దిశగా కేంద్ర మంత్రులంతా పని చేయాలని నిర్దేశించారు. ప్రధానంగా పరిపాలనపై దృష్టిపెట్టాలని, తమ పరిధిలోని పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కాగా, 2014 నుంచి ప్రతిసారీ కేంద్ర కేబినెట్ ఏర్పాటుకు ముందుగా మోదీ తన నివాసంలో కాబోయే మంత్రులతో సమావేశం అవుతున్నారు. వారు చేపట్టాల్సిన బాధ్యతలను, వారి నుంచి ఆశిస్తున్న పనితీరు గురించి వారికి వివరిస్తున్నారు. ఆదివారం నాటి సమావేశంలో బీజేపీ నేతలు మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ కుమార్, రవ్ నీత్ సింగ్ బిట్టూ, తదిరులు పాల్గొన్నారు. వీరందరికీ కేంద్ర కేబినెట్ లో కొత్తగా చోటు దక్కింది. అలాగే కేబినెట్ లో మరోసారి చోటు దక్కిన పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, మన్ సుఖ్ మాండవీయ తదితరులు కూడా తేనీటి విందుకు హాజరయ్యారు. కాగా, ఢిల్లీలో ట్రాఫిక్ కారణంగా మీటింగ్ కు లేట్ కావడంతో పంజాబ్ బీజేపీ నేత రవ్ నీత్ సింగ్ బిట్టూ కారు దిగి పరుగెత్తుకుంటూ ప్రధాని నివాసంలోకి వెళ్లడం వీడియోలో కనిపించింది.  

తెలంగాణ నుంచి ఇద్దరు సామాన్యులకు ఆహ్వానం 

మోదీ  ప్రమాణ స్వీకారానికి తెలంగాణ నుంచి ఇద్దరు సామాన్యులు హాజరయ్యారు. చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తోన్న సిరిసిల్లకు చెందిన యెల్ది హరి ప్రసాద్, మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం, నర్సింల గూడెంలో ప్రైమరీ స్కూల్ టీచర్ కొడిపాక రమేశ్ కు ఆహ్వానం అందింది. కేంద్రం పంపిన ఇన్విటేషన్ లతో వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గతంలో ‘మన్ కీ బాత్’ ప్రోగ్రాంలో భాగంగా హరి ప్రసాద్, కొడిపాక రమేశ్ ల గొప్పతనాన్ని మోదీ మెచ్చుకున్నారు. హరి ప్రసాద్ చేనేత కళ కోసం చేస్తోన్న కృషిని అభినందించారు. తన తల్లి అరుణ తమకు మహాలక్ష్మీ అంటూ దీపావళి సందర్భంగా టీచర్ రమేశ్ రాసిన లేఖకు ముగ్ధుడనయ్యాని ప్రధాని కొనియాడారు.  

మహాత్మాగాంధీకి మోదీ నివాళి

ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మోదీ ఆదివారం ఉదయం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి, సదైవ్ అటల్ మెమోరియల్ వద్ద అటల్ బిహారీ వాజ్ పేయికి నివాళులు అర్పించారు. అలాగే, నేషనల్ వార్​మెమోరియల్​వద్ద అమర జవాన్లకు కూడా పుష్పాంజలి ఘటించారు. మోదీ వెంట పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. 
-