రాముడి విలువలే సబ్‌‌‌‌కా సాథ్‌‌‌‌.. సబ్‌‌‌‌కా విశ్వాస్‌‌‌‌కు స్ఫూర్తి

రాముడి విలువలే సబ్‌‌‌‌కా సాథ్‌‌‌‌.. సబ్‌‌‌‌కా విశ్వాస్‌‌‌‌కు స్ఫూర్తి

అయోధ్య: తన మాటలు, ఆలోచనలు, పాలన ద్వారా రాముడు నేర్పిన విలువలే ‘సబ్‌‌‌‌కా సాథ్.. సబ్‌‌‌‌కా విశ్వాస్‌‌‌‌’కు స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘సబ్‌‌‌‌కా విశ్వాస్, సబ్‌‌‌‌కా ప్రయాస్‌‌‌‌’ కు కూడా ఆయన విలువలే ఆధారమని చెప్పారు. దీపావళిని పురస్కరించుకుని ఆదివారం అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. అంతకుముందు అయోధ్యకు చేరుకున్న మోడీకి గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి స్వాగతం పిలికారు. నేరుగా రామ జన్మభూమికి వెళ్లిన పీఎం.. అక్కడ రామ్‌‌‌‌లల్లా విగ్రహానికి పూజలు చేశారు. దీపం వెలిగించి, హారతి ఇచ్చారు. తర్వాత గుడి నిర్మాణ పనులను పరిశీలించారు. సాయంత్రం సరయూ నది ఒడ్డున నిర్వహించిన హారతిని వీక్షించారు.

రామ్‌‌‌‌ కథా పార్క్‌‌‌‌లో ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ‘‘అయోధ్య మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచమంతా దీపోత్సవాన్ని చూస్తున్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌‌‌ జరుపుకుంటున్న వేళ.. రాముడిలాంటి సంకల్పం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది” అని ఆశాభావం వ్యక్తంచేశారు. వచ్చే పాతికేళ్లలో ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ కావాలని ఆకాంక్షించే ప్రజలకు శ్రీరాముడి ఆదర్శాలు దారి చూపిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని పురస్కరించుకుని అయోధ్యలో దాదాపు 18 లక్షల దీపాలను వెలిగించారు. సరయూ నదీ తీరంలోని ‘రామ్‌‌‌‌కీ పైడీ’లో 15 లక్షల దీపాలను 22 వేల మందికి పైగా వాలంటీర్లు వెలిగించారు. లేజర్‌‌‌‌‌‌‌‌ షో ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాల కళాకారులు రామ్‌‌‌‌లీల ప్రదర్శించారు.