చెరువు కట్టపై సర్కస్ ​ప్రయాణం

చెరువు కట్టపై సర్కస్ ​ప్రయాణం

రెండు కార్పొరేషన్ల మధ్య ప్రధాన రహదారి అది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఇందులో వింతే ముంది.. అనుకుంటే పొరపడినట్లే. ఆ రహదారి  మీర్ పేట్ పెద్ద చెరువు కట్ట మీద ఉండటం విశేషం. ఈ రోడ్డు ఇరుకుగా ఉండటమే కాకుండా ఇరువైపులా బీటీ దెబ్బతినడం, బీటీ రహదారికి పక్కన ఉన్న మట్టి దారికి మధ్యన ఆరు అంగుళాల వ్యత్యాసం ఉండటంతో తరచూ ప్రమాదాలకు నిలయంగా మారింది.

వారం క్రితం రెండు బైక్​లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అసలే ఇరుకుగా ఉన్న ఈ రోడ్డు పై ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చేదాకా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాలను అదుపు చేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పడు బీటీ దిగి పక్కకు జరగాలంటే కొన్ని చోట్ల రహదారి అంచుల వరకు మట్టి కట్ట కిందకు జారిపోయి ఉండటంతో వాహనాలు నేరుగా చెరువులో బోల్తా పడే అవకాశం ఉంది. కట్టకు మరో వైపు నివాసాలు ఉన్నందున అటు వైపు కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పెద్ద వాహనాలు ఎదురైనప్పుడు ఎవరో ఒకరు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల చెరువు కట్ట మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

ప్రమాదాల నివారణకు ఏం చేయాలి?

చెరువు కట్ట రహదారిపై ప్రమాదాల నివారణకు కట్టను ఇరువైపులా విస్తరించాలి. ప్రస్తుతం ఉన్న కట్టకు ఇరువైపుల మట్టి పోసి ద్వారా వెడల్పు చేయాలి. తద్వారా బీటీ రోడ్డును కూడా రెండు వాహనాలు ఒక దాని పక్కన ఒకటీ సాఫీగా వెళ్లేంతగా విస్తరించాలి. రహదారి విస్తరిస్తే ప్రమాదాలకు చెక్​పెట్టొచ్చని పురపాలిక ప్రజలు ఆభిప్రాయపడుతున్నారు. వాహనాలు అదుపు తప్పినప్పడు కిందకు దూసుకుపోకుండా ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలి.దీని వల్ల చెరువు కట్ట కింద భాగం లోని కాలనీలకు సైతం రక్షణగా ఉంటుంది. చెరువు సందరీకరణ చేపడతామని కొన్నేళ్ల నుంచి ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారు. అయితే సందరీకరణలో భాగంగా చెరువు కట్ట విస్తరణతో పాటు కట్టకు ఇరువైపులా పటిష్టమైన కంచె ఏర్పాటు చేస్తే ఈ రహదారిపై ప్రయాణం మరింత సాఫీగా జరిగే అవకాశంఉంది.