అమెరికా టారిఫ్‎లపై కనీసం నోరెత్తరు: మోడీ సర్కార్‎పై రాహుల్ గాంధీ ఫైర్

అమెరికా టారిఫ్‎లపై కనీసం నోరెత్తరు: మోడీ సర్కార్‎పై రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: మోడీ సర్కార్‎పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ పరిపాలనలో భారత ఆర్ధిక వ్యవస్థ డెడ్ ఎకానమీగా మారిందని విమర్శించారు. అమెరికా సుంకాలు భారత వస్త్ర పరిశ్రమను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని.. వస్త్ర ఎగుమతిదారులకు కేంద్రం ఆదుకోవడం లేదని మండిపడ్డారు. భారత ఆర్ధిక వ్యవస్థపై భారం పడుతున్న సుంకాల సమస్యను మోడీ సర్కార్ పరిష్కరించడం లేదని నిప్పులు చెరిగారు. హర్యానాలోని ఒక వస్త్ర కర్మాగారాన్ని శుక్రవారం (జనవరి 22) రాహుల్ గాంధీ సందర్శించారు. 

ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమానితో మాట్లాడాడు. వ్యాపారం ఎలా సాగుతుంది.. అమెరికా సుంకాలు ఏ మేర ప్రభావం చూపుతున్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాని మాట్లాడుతూ.. వస్త్ర పరిశ్రమ శ్రమతో కూడుకున్నదని.. దేశంలో వ్యవసాయం తర్వాత రెండవ అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు.

 గతంలో అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఉండేవని, 50 శాతం సుంకాల తర్వాత ఆర్డర్లు లేక వ్యాపారం డీలా పడిపోయిందని.. సుంకాలు ఇంకా పెరిగితే పరిశ్రమలు మూతపడిపోతాయని రాహుల్ గాంధీతో చెప్పాడు. ఈ మేరకు వస్త్ర పరిశ్రమను సందర్శించిన వీడియోను రాహుల్ గాంధీ శనివారం (జనవరి 23) సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.  

►ALSO READ | ఇరాన్ దేశాన్ని చుట్టుముట్టిన అమెరికా సైన్యం : యుద్ధ నౌకల నుంచే యుద్ధం మొదలవుతుందా..?

‘‘అమెరికా 50 శాతం సుంకాలు, యూరప్‌లో ధరలు తగ్గడం, బంగ్లాదేశ్, చైనా నుండి తీవ్రమైన పోటీ కారణంగా భారత వస్త్ర పరిశ్రమ.. వస్త్ర ఎగుమతిదారులు తీవ్రంగా దెబ్బ తింటున్నారు. ఇది ఉద్యోగాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. -పరిశ్రమలు మూతపడుతున్నాయి. మొత్తం వస్త్ర రంగంలో గందరగోళం ఉంది. భారత వ్యాపారాలు, భారతీయ కార్మికులకు ప్రాధాన్యతనిచ్చే అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని భారతదేశం పొందడం అత్యవసరం’’ అని రాహుల్ పేర్కొన్నాడు. 

కేంద్రం సుంకాల సమస్యను పరిష్కరించకపోవడంతో వస్త్ర వ్యాపారులు తీవ్రంగా దెబ్బ తింటున్నారని.. 4.5 కోట్లకు పైగా ఉద్యోగాలు, లక్షలాది వ్యాపారాలు ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ అమెరికా సుంకాలపై నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇకనైనా ఈ విషయంపై దృష్టి పెట్టాలని సూచించారు.