Mammootty Padayatra : మమ్ముట్టి ‘పాదయాత్ర’ షురూ.. 32 ఏళ్ల తర్వాత లెజెండరీ దర్శకుడితో మెగాస్టార్ మ్యాజిక్!

Mammootty Padayatra : మమ్ముట్టి ‘పాదయాత్ర’ షురూ.. 32 ఏళ్ల తర్వాత లెజెండరీ దర్శకుడితో మెగాస్టార్ మ్యాజిక్!

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రూటే వేరు. వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ.. డెబ్బై ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. 'కన్నూర్ స్క్వాడ్', 'భ్రమయుగం' వంటి విభిన్న చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు మమ్ముట్టి. అయితే లేటెస్ట్ గా తన ఎనిమిదవ నిర్మాణ చిత్రంగా‘పాదయాత్ర’ను ప్రకటించారు. ఈ టైటిల్ వినగానే అందరిలోనూ ఒకే ప్రశ్న.. ఇది వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర'కు సీక్వెలా? లేక ఏపీ రాజకీయాలకు సంబంధించిందా? అని. కానీ, ఈ సినిమా వెనుక అంతకు మించిన ఒక భారీ సంచలనం ఉంది.

32 ఏళ్ల నిరీక్షణకు తెర.. !

ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద క్రేజ్ ఏంటంటే, దీనికి దర్శకత్వం వహిస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ లెజెండరీ ఫిల్మ్ మేకర్ అదూర్ గోపాలకృష్ణన్. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందంటే అది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక కళాఖండం అవుతుందని సినీ ప్రియులు భావిస్తారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్ళీ జతకడుతున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అనంతరం’ , ‘మథిలుకల్’ ,  ‘విధేయన్’  చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. ముఖ్యంగా ‘విధేయన్’ చిత్రానికి మమ్ముట్టి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇప్పుడు మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుండటంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

రాజకీయాలా? ఆత్మ అన్వేషణా?

తెలుగు రాష్ట్రాల్లో 'పాదయాత్ర' అనే పదం వినగానే రాజకీయాలు గుర్తొస్తాయి. గతంలో మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా 'యాత్ర'లో మెప్పించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేం. పైగా ఇటీవల ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, అదూర్ గోపాలకృష్ణన్ శైలి పూర్తిగా భిన్నం. ఆయన బయోపిక్‌ల కంటే కూడా మనిషిలోని అంతర్మథనాన్ని, సామాజిక సంక్లిష్టతలను తెరకెక్కించడంలో దిట్ట. కాబట్టి, ఈ ‘పాదయాత్ర’ ఒక వ్యక్తి జీవిత ప్రయాణం లేదా సామాజిక అంశాల చుట్టూ తిరిగే కథ కావచ్చని సమాచారం.

►ALSO READ | Chiranjeevi: మెగాస్టార్ సరసన ప్రియమణి.. బాబీ మ్యాజిక్ ప్లాన్ రిపీట్ అవుతుందా?

షూటింగ్ ప్రారంభం.. 

కొచ్చిలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ( జనవరి 23, 2026 ) పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంచనంగా ప్రారంభమైంది. మమ్ముట్టి కంపెనీ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో నయనతార లేదా అను సితార కీలక పాత్రల్లో నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ శిష్యుడైన కె.వి. మోహన్ కుమార్ ఈ చిత్రానికి సహ రచయితగా వ్యవహరిస్తున్నారు.

 

మరో జాతీయ అవార్డు ఖాయమా?

అదూర్ గోపాలకృష్ణన్ గడిచిన 60 ఏళ్లలో తీసినవి తక్కువ సినిమాలే అయినా, అందులో మెజారిటీ చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టాయి. 2016 తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టిన అదూర్, తన ఫేవరెట్ నటుడు మమ్ముట్టితో కలిసి వస్తుండటంతో మరోసారి భారతీయ సినిమా రంగం కేరళ వైపు చూస్తోంది. కమర్షియల్ హంగులకు దూరంగా, వాస్తవికతకు దగ్గరగా ఉండే ఈ ‘పాదయాత్ర’ మమ్ముట్టి కెరీర్‌లో మరో కలికితురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు సినీ ప్రియులు.