తాగుబోతుల తెలంగాణగా మార్చిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి : ఆవుల రాజిరెడ్డి

తాగుబోతుల తెలంగాణగా మార్చిన  కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి : ఆవుల రాజిరెడ్డి

కౌడిపల్లి, వెలుగు : రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చారని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన కౌడిపల్లి మండలం నాగసానిపల్లి, తిమ్మాపూర్, దేవులపల్లి, కౌడిపల్లి, లింగంపల్లి, షేరి తండా, కంచన్ పల్లి లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి అందరిని తాగుబోతులుగా మార్చారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు ఇస్తామని మోసం చేయడంతో, అనేక మంది పేదలు గుడిసెల్లో ఇబ్బందులు పడుతు జీవనం సాగిస్తున్నారని అన్నారు.

మండల కేంద్రమైన కౌడిపల్లి లోని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇంటి పక్క నుంచి వెళ్లే దేవులపల్లి రోడ్డు దశాబ్దకాలంగా అద్వానంగా ఉండగా పట్టించు కోలేదని, కేవలం భూకబ్జాదారుల మెప్పు కోసమే ఇటీవల రోడ్డు నిర్మాణం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి గ్రామంలోనే పరిస్థితి ఇలా ఉండగా, నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో ఎక్కడ కూడా సరైన రోడ్లు లేక నానా తిప్పలు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు అన్ని రకాలుగా అభివృద్ధి జరగడంతో పాటు చదువుకున్న పిల్లలకు కొలువులు వస్తాయన్నారు.

ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలు, ఇల్లు లేని వారికి ఐదు లక్షల సాయం వంటి పథకాలు పక్కాగా అమలవుతాయన్నారు. ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోచయ్య, మాజీ ఎంపీపీ యాద గౌడ్, నాయకులు భైరవ స్వామి, ఆంజనేయులు, మాణిక్య రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నరహరి, వీర గౌడ్, కిషన్ గౌడ్ పాల్గొన్నారు.