త్వరలో అందుబాటులోకి నార్సింగి ఇంటర్‌చేంజ్

త్వరలో అందుబాటులోకి నార్సింగి ఇంటర్‌చేంజ్

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా ఔటర్‌ రింగు రోడ్డు చుట్టు పక్కల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై దృష్టి సారించింది హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ). గచ్చిబౌలి నుంచి నార్సింగి, కోకాపేట వరకు ఓఆర్‌ఆర్‌ ప్రధాన రహదారి (మెయిన్‌ క్యారేజ్‌వే), సర్వీసు రోడ్లపై ట్రాఫిక్‌ గణనీయంగా పెరగడంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నార్సింగి ఇంటర్‌చేంజ్‌ వద్ద చేపట్టిన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేశారు అధికారులు. మార్చి నెల చివరిలో ఇది అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే గత ఫిబ్రవరిలోనే నార్సింగి ఇంటర్‌చేంజ్‌ పనులను పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు అనుమతించాల్సి ఉంది. 

అయితే క్షేత్ర స్థాయిలో పనుల నిర్వహణలో పలు అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రధానంగా నార్సింగి ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌చేంజ్‌ వద్ద మూసీ నది ఉండటంతో అక్కడ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయారు. సుమారు రూ.65 కోట్లతో నార్సింగి ఇంటర్‌చేంజ్‌తో పాటు కోకాపేట నియోపోలిస్‌ ట్రంపెట్‌ నిర్మాణ పనులను హెచ్‌ఎండీఏ చేపట్టింది. పనులు పూర్తయిన వెంటనే తొలుత నార్సింగి ఇంటర్‌చేంజ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి, ఆ తర్వాత కోకాపేట నియోపోలిస్‌ ఓఆర్‌ఆర్‌ ట్రంపెట్‌ నిర్మాణ పనులను జూన్‌–జూలై నాటికి పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు.

కాగా, నార్సింగి, కోకాపేట, పుప్పాల్‌గూడ, మంచిరేవుల ప్రాంతాల్లో ఐటీ కంపెనీల కార్యాలయాలతో పాటు నివాస ప్రాంతాలు, హైరైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ అపార్టుమెంట్లు, విల్లాలు, ఇతర నివాసాలు ఎక్కువగా ఏర్పాటవుతుండటంతో నార్సింగి ఇంటర్‌చేంజ్‌ కీలకంగా మారనున్నది. భవిష్యత్తులోను ఈ ప్రాంతంలో మరిన్ని నివాసాలు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌ గణనీయంగా పెరుగనున్నది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న హెచ్‌ఎండీఏ నార్సింగి ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌చేంజ్‌ను అందుబాటులోకి రానుంది. దీంతో వాహనాల రద్దీ తగ్గనుంది.