హైదరాబాద్: మణికొండలో మహిళతో తప్పుగా ప్రవర్తించిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనను నార్సింగి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని నార్సింగి పోలీసులు విచారించారు. మే 19న బాధిత మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
మే14వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో తన రెండున్నరేళ్ల చిన్నారిని సమీపంలోని ప్లే స్కూల్ నుంచి తీసుకుని ఇంటికి వెళ్తుండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిన్ రోడ్ నుంచి వెంటాడుతూ వచ్చి వెనుక నుంచి ఆమె దుస్తులను పైకి లాగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ గట్టిగా అరవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు BNS సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా వడ్డే నాగరాజు (26) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడు ప్రస్తుతం గండిపేట మండలం పుప్పాలగూడలో నివాసం ఉంటుండగా, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం చాకలిపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి తెలిపారు.
