చంద్రుడిపై ఇళ్లు కట్టనున్న నాసా.. ఇటుకలు, సిమెంట్ వాడతారా..?

చంద్రుడిపై ఇళ్లు కట్టనున్న నాసా.. ఇటుకలు, సిమెంట్ వాడతారా..?

భారత్ సహా అన్ని దేశాలు ఇప్పుడు చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్నాయి. చందమామపై మనుషులు బతికే వాతావరణం ఉందా..అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయని పరిశోధనలు జరుపుగుతున్నాయి. అయితే మిగతా దేశాలు ఇంకా ప్రయోగాల దశలోనే ఉంటే..నాసా మాత్రం చంద్రుడిపై ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు సిద్దమవుతోంది.  

త్వరలో చంద్రుడిపై నాసా ఇండ్లను నిర్మించనుంది.  2040లోపు  చంద్రుడిపై మనుషుల కోసం నాసా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల కోసం వ్యోమగాములు అధిక సమయం అక్కడే ఉండేందుకు ఈ ఇండ్లు తోడ్పడతాయని నాసా భావిస్తోంది. ఈ ఇండ్లను 3డీ ప్రింటర్‌ సాయంతో రాక్‌ చిప్స్, ఖనిజాలను ఉపయోగించి  నిర్మించాలని చూస్తోంది. 

2024 ఫిబ్రవరిలో  3డీ ప్రింటర్‌ను చంద్రునిపైకి పంపుతామని నాసా డైరెక్టర్ నిక్కీ వెర్కీసర్ వెల్లడించారు.  ప్రస్తుతం ప్రింటర్‌ పనితీరును పరీక్షిస్తున్నట్లు తెలిపారు.  ప్రైవేటు కంపెనీలు, యూనివర్సిటీలను భాగస్వామంతో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి చంద్రుడిపై ఇళ్ల  నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. తామంతా ఒక ఉమ్మడి లక్ష్యంతో.... సరైన సమయంలో సరైన వ్యక్తులను ఒక చోటుకి చేర్చామని... చంద్రునిపైకి తప్పకుండా చేరుకుంటామని దీమా వ్యక్తం చేశారు. 

ఆర్టెమిస్‌-1 ప్రయోగించిన  నాసా.. ఆర్టెమిస్‌-2, ఆర్టెమిస్‌-3 ప్రయోగాలకు  సిద్ధమవుతోంది.  2024లో ఆర్టెమిస్‌-2 ప్రయోగం చేపట్టనుంది. ఆర్టెమిస్ 2లో నలుగురు వ్యోమగాములు వెళ్తారు. వీరు చంద్రుడిపై దిగకుండా, ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి వస్తారు. ఆ యాత్ర విజయవంతమైతే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యంత ఎక్కువ దూరం అదే అవుతుంది. 2025లో ఆర్టెమిస్‌-3 ప్రయోగం చేపట్టనుంది నాసా. ఈ యాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతారని నాసా తెలిపింది.