హైదరాబాద్, వెలుగు: ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, భద్రత, ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్త్ కమాండ్ సెంటర్ అధికారుల సమన్వయంతో ‘నాతోనే మార్పు’ పేరుతో ప్రత్యేక తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు.. తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. రానున్న రోజుల్లో దశలవారీగా సొసైటీ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఈ తరహా కార్యక్రమం చేపట్టునున్నారు.
పిల్లల చదువును తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని, వారి సమస్యలను ఓపికగా విని అర్థం చేసుకోవాలని, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కౌన్సిలర్లు సూచించారు. గురుకుల విద్యాసంస్థలతో నిరంతరం సమన్వయంతో పనిచేస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.“పిల్లల భవిష్యత్తులో మార్పు రావాలంటే ఆ మార్పు ముందుగా మన నుంచే ప్రారంభం కావాలి” అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ‘నాతోనే మార్పు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల సంక్షేమంపై తల్లిదండ్రుల్లో మరింత బాధ్యతను, క్రియాశీలక భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఈ వేదిక ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
