డేంజర్‌‌‌‌లో సింగూరు డ్యామ్..రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఎన్‌‌డీఎస్‌‌ఏ లేఖ

డేంజర్‌‌‌‌లో సింగూరు డ్యామ్..రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఎన్‌‌డీఎస్‌‌ఏ లేఖ
  • రివెట్‌‌మెంట్​దెబ్బతిన్నది.. ఎర్త్​ డ్యామ్‌‌కు పగుళ్లు
  • వెంటనే రిపేర్లు చేయాలి.. 21లోగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: సింగూరు డ్యామ్​ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నదని నేషనల్​ డ్యామ్‌‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌డీఎస్‌‌ఏ) హెచ్చరించింది. వెంటనే దానికి రిపేర్లు చేయించాలని, ప్రాజెక్టు భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలపై ఈ నెల 21లోగా రిపోర్ట్​ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సింగూరు డ్యామ్​సేఫ్టీపై బుధవారం ఇరిగేషన్​ శాఖ ఈఎన్సీకి ఎన్‌‌డీఎస్‌‌ఏ దక్షిణాది ప్రాంత డైరెక్టర్​ గిరిధర్​ లేఖ రాశారు. మంజీరా నదిపై ఉన్న సింగూర్‌‌ డ్యామ్‌‌ను వర్షాకాలానికి ముందు డ్యామ్‌‌ సేఫ్టీ రివ్యూ ప్యానల్స్​‍ (డీఎస్ఆర్‌‌పీ) తనిఖీ చేసింది.

ఆ నివేదికను ఇటీవల ఎన్‌‌డీఎస్ఏకి సమర్పించింది. డీఎస్ఆర్‌‌పీ నివేదిక ప్రకారం సింగూరు డ్యామ్‌‌ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని ఎన్‌‌డీఎస్‌‌ఏ హెచ్చరించింది. డ్యామ్‌‌ ఎగువన ఉన్న రివెట్‌‌మెంట్‌‌తోపాటు ఎఫ్‌‌ఆర్‌‌ఎల్‌‌ భాగానికి సమీపంలోని వివిధ ప్రదేశాల్లో మట్టివాలు రివెట్‌‌మెంట్‌‌ దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. పారాపెట్‌‌ గోడకు ఆనుకొని ఉన్న ఎర్త్​ డ్యామ్‌‌ పైభాగంలో పగుళ్లు ఉన్నాయని, గోడ కూడా ఎగువ వైపునకు వంగిపోయి ఉన్నదని వెల్లడించింది.

డ్యామ్​ డిజైన్‌‌ ప్రకారం రిజర్వాయర్‌‌ స్థాయిని 517.8 మీటర్ల వరకు ఆపరేట్‌‌ చేయవచ్చని, కానీ, మిషన్‌‌ భగీరథ పథకం కోసం రిజర్వాయర్‌‌ కనీస స్థాయి 522 మీటర్ల కన్నా ఎక్కువగా నీటిని నిల్వ చేస్తున్నారని తెలిపింది. ఆపరేట్​ చేయాల్సిన దానికన్నా ఎక్కువ ఎత్తులో నీటిని నిల్వ చేయడం వల్ల డ్యామ్​ పటిష్టతపై ప్రభావం పడుతున్నదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే ఇంకా లేట్​ చేయకుండా వీలైనంత త్వరగా మట్టి ఆనకట్టకు రిపేర్లు చేయాలని తేల్చి చెప్పింది. సింగూరు దిగువన మంజీరా, నిజాంసాగర్‌‌‌‌లాంటి రిజర్వాయర్లు కూడా ఉన్నాయని, దీంతో సింగూరు డ్యామ్​ భద్రతను ఉపేక్షిస్తే ఆ 2 రిజర్వాయర్లకూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాబట్టి వెంటనే సింగూరు డ్యామ్‌‌కు రిపేర్లు చేయాలని ఆదేశాలిచ్చింది.