నిథమ్​ను రియల్ ఎస్టేట్ క్యాంపస్​గా మార్చిన్రు

నిథమ్​ను రియల్ ఎస్టేట్ క్యాంపస్​గా మార్చిన్రు
  • అవినీతికి పాల్పడిన డైరెక్టర్   
  •     జీతాలు ఇవ్వలేని పరిస్థితి
  •     ఆరోపించిన సంస్థ ఉద్యోగులు
  •     ప్లకార్డులతో ఆందోళన  

గచ్చిబౌలి, వెలుగు :  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజిమెంట్(నిథమ్)ను డైరెక్టర్ ఎస్. చిన్నంరెడ్డి  రియల్​ ఎస్టేట్ ​క్యాంపస్​గా మార్చివేశారని, తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఉద్యోగులు ఆరోపించారు.  డైరెక్టర్ తీరుతో నిథమ్ మూతపడే స్థితికి చేరిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని నిథమ్ క్యాంపస్ ఆవరణలోని అడ్మిన్ ఆఫీసు ముందు ఇనిస్టిట్యూట్ ఉద్యోగులు నల్ల రంగు దుస్తులు ధరించి ఆందోళనకు దిగారు. చిన్నంరెడ్డిని విధుల నుంచి వెంటనే తొలగించడంతో పాటు ఆయన అవినీతి సొమ్ముని రాబట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల అండతో చిన్నంరెడ్డి నిరంకుశంగా పాలన చేశారని,  కాగ్ మొట్టికాయలు వేసిన అంశాన్ని కూడా వారు గుర్తు చేశారు.

అనంతరం మీడియా సమావేశంలో నిథమ్ రిజిస్ట్రార్ శ్రీధర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మహేందర్రెడ్డి, కిరణ్మయి, ఫైనాన్స్ ఆఫీసర్ శేషయ్య, ఎస్టాబ్లిష్ మెంట్ ఆఫీసర్ హనుమంతరావు మాట్లాడారు.  యువతకు శిక్షణ అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిథమ్​ను ప్రారంభించారని పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ డైరెక్టర్​గా చిన్నంరెడ్డి బాధ్యతలు స్వీకరించాక 2016 నుంచి సంస్థ పతనం మొదలైందని ఆరోపించారు. చిన్నంరెడ్డి ఎంపిక పైరవీతోనే జరిగిందని, టూరిజం అండ్ హాస్పిటాలిటీలో డిగ్రీ లేకపోయినా నాటి ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న తన సోదరుడి అండదండలతో డైరెక్టర్​గా వచ్చారని గుర్తుచేశారు. 

ఏ యూనివర్సిటీ వీసీ తీసుకోని విధంగా నిథమ్ డైరెక్టర్​గా చిన్నంరెడ్డి నెలకు 3.30లక్షల జీతం అక్రమంగా తీసుకున్నాడన్నారు. గతంలో దేశ, విదేశాల విద్యార్థులు నిథమ్​లో కోర్సులు చదివేందుకు వచ్చేవారని, 900 మంది ఉండే విద్యార్థుల సంఖ్య..  చిన్నంరెడ్డి అవినీతి, ఒంటెత్తు పోకడలతో 250కి పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిథమ్​లో రూ.13 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేసిందని, వాస్తవంగా దాదాపు రూ. 50 కోట్లు ఉండొచ్చని వారు ఆరోపించారు. 

గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి లేకుండా చిన్నంరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని, నిథమ్​ను రియల్ ఎస్టేట్ ఆఫీసుగా, రాజకీయ పార్టీ ఆఫీస్​గా వాడుకున్నాడని ఆరోపించారు. తన రాజకీయ పలుకుబడితో నిథమ్​లో ఉన్న భవనాలను క్లౌడ్ కిచెన్ వంటి ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చి కోట్ల రూపాయల అవినీతి సొమ్మును వెనుకేసుకున్నాడని మండిపడ్డారు. 

 నిథమ్ ఉద్యోగులను సైతం ప్రైవేటు సంస్థలకు పనిచేసే విధంగా ఒత్తిడి తెచ్చారన్నారు.  ప్రైవేటు ఇనిస్టిట్యూట్​తో లోపాయికారి ఒప్పందం చేసుకొని, టూరిజంకు సంబంధించిన ఇనిస్టిట్యూట్​కు నిథమ్​తో కల్పించడం జరిగిందన్నారు. డైరెక్టర్​గా తను బోధించాల్సిన స్టాటిస్టిక్స్ మేనేజ్​మెంట్​ గురించి పాఠాలు చెప్పకుండా పరీక్షల్లో సైతం అక్రమాలకు పాల్పడుతున్నారని వాపోయారు. తన అవినీతిని ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేసి సంస్థ నుంచి పంపించారన్నారు. 

గవర్నింగ్​ కౌన్సిల్ ​మీటింగ్ లు  నిర్వహించకుండా... కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల అనుమతి లేకుండా నోటి మాటతో కోట్ల రూపాయల పనులు చేయించి, అందులో వాటాల రూపంలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు.  ప్రస్తుతం నిథమ్​ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని వాపోయారు. వెంటనే డైరెక్టర్​ చిన్నంరెడ్డిని తొలగిండంతో పాటు అతని అవినీతిపై విచారణ చేయించాలని డిమాండ్​ చేశారు. నిథమ్​కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరారు. ఆందోళనలో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.