తెలంగాణపై నేషనల్ మీడియా ఫోకస్! .. ప్రముఖ జర్నలిస్టులతో కవరేజీ

తెలంగాణపై నేషనల్ మీడియా ఫోకస్! .. ప్రముఖ జర్నలిస్టులతో కవరేజీ
  • ప్రధాన పార్టీల జాతీయ నేతలంతా ఇక్కడే మోహరింపు

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ రాజకీయాలపై నేషనల్ మీడియా ఫోకస్ పెట్టింది. జాతీయ స్థాయి నాయకులంతా ఇక్కడే మోహరించడంతో విస్తృతంగా కవరేజీ ఇస్తున్నది. ప్రముఖ జర్నలిస్టులు ప్రధాన పార్టీల లీడర్ల వెంట తిరుగుతూ.. ప్రత్యేక ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడం, ఇక్కడి ఎన్నికల ఫలితాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ప్రభావితం చేస్తాయన్న అంచనాల నేపథ్యంలో జాతీయ మీడియా దృష్టి పెట్టింది.

రేవంత్‌‌తో రాజ్‌‌దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల్లోని ప్రధాన లీడర్లను నేషనల్ మీడియాకు చెందిన కొందరు సీనియర్​ జర్నలిస్టులు కలుస్తున్నారు. పోల్ ట్రెండ్స్, స్ట్రాటజీని తెలుసుకుంటున్నారు. వారం క్రితం సీఎం కేసీఆర్‌‌‌‌ను ప్రముఖ జర్నలిస్ట్, ఎన్డీటీవీ మాజీ ఓనర్ ప్రణయ్ రాయ్ కలిసినట్టు తెలిసింది. వారిద్దరి భేటీ అత్యంత రహస్యంగా సాగినట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే వారు ఏం చర్చించారన్నది బయటకు రాలేదు. కొన్ని రోజుల కిందట సీనియర్ జర్నలిస్ట్, ఇండియా టుడే ఎడిటర్ రాజ్‌‌దీప్ సర్దేశాయి.. పీసీసీ చీఫ్ రేవంత్‌‌ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. ఉదయం టిఫిన్ తింటూ ఎన్నికల ప్రచారం గురించి రేవంత్‌‌ను ఆరా శారు. ఇటీవల కామారెడ్డిలో కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోకు బర్కాదత్ హాజరయ్యారు. ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ రోడ్​షోను కవర్ చేశారు.

జాతీయ నేతలంతా ఇక్కడే

బీజేపీ, కాంగ్రెస్‌‌లు ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి నేతలను పోటాపోటీగా ప్రచారానికి రప్పించాయి. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, కర్నాటక మంత్రులు, పార్టీ జాతీయ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు హైదరాబాద్‌‌కు వచ్చారు. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఇక్కడే మోహరించారు. తమ పార్టీ అభ్యర్థుల తరఫున వరుస ప్రచారాలు నిర్వహించారు. రెండు పార్టీల కీలక నేతలు ఇక్కడే ఉండటంతో నేషనల్ మీడియా అటెన్షన్ రాష్ట్రంపై పడింది. మన రాష్ట్రానికి సంబంధించి రాజకీయ వ్యవహారాలపై స్పెషల్ డిబేట్లనూ ఆయా సంస్థలు నిర్వహించాయి. సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్‌‌లో జరిగినప్పటి నుంచి నేషనల్​మీడియా చానెళ్ల ప్రతినిధుల రాక పెరిగింది.