ట్రాన్స్​జెండర్​కు అడ్మిషన్​ ఎందుకివ్వలేదు?

ట్రాన్స్​జెండర్​కు అడ్మిషన్​ ఎందుకివ్వలేదు?

ఎన్​ఎంసీ, రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు : ట్రాన్స్‌‌జెండర్‌‌ అభ్యర్థికి రిజర్వేషన్‌‌ కోటా కింద పీజీ మెడికల్‌‌ అడ్మిషన్​ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని నేషనల్‌‌ మెడికల్‌‌ కమిషన్‌‌ (ఎన్‌‌ఎంసీ), రాష్ట్ర సర్కార్‌‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు ఎన్‌‌ఎంసీతో పాటు రాష్ట్ర  ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఎస్సీ, ఓబీసీ కింద అడ్మిషన్‌‌ పొందిన చివరి అభ్యర్థులు నీట్‌‌ పీజీ–2023లో పొందిన మార్కుల వివరాలను అందజేయాలని ఎన్‌‌ఎంసీని ఆదేశించింది. ట్రాన్స్‌‌జెండర్‌‌కు రిజర్వేషన్‌‌ అమలు చేయలేదని డాక్టర్‌‌ కొయ్యల రూత్‌‌ జాన్‌‌పాల్‌‌ దాఖలు చేసిన రిట్‌‌ను సోమవారం చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ తుకారాంజీలతో కూడిన డివిజ న్‌‌ బెంచ్‌‌ విచారించింది. పిటిషనర్‌‌ లాయర్‌‌ కోనేరు సాగరిక వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ను మహిళా అభ్యర్థుల కింద కలిపారని తెలిపారు. 

ఏడాది నుంచి పోరాటం చేస్తున్నామని, ఈసారి నీట్‌‌ పీజీ పరీక్షల్లో కూడా అర్హత పొందినట్లు చెప్పారు. ఎన్‌‌ఎంసీ లాయర్‌‌ పూజిత వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌‌ 2022 నీట్​లో పరీక్ష రాశారని, ప్రస్తుతం నీట్‌‌ 2023 కూడా పూర్తయిందని చెప్పారు. ఎస్సీ కోటా కింద రిజర్వేషన్‌‌ పొందిన తర్వాత థర్డ్‌‌ జెండర్‌‌ కోటాలో కోరడం చట్టవిరుద్ధమని అన్నారు. ఎస్సీ కేటగిరీలోనూ అర్హత మార్కులు సాధించలేదన్నారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ‘అయితే, మహిళా రిజర్వేషన్లు కూడా చట్ట విరుద్ధమా’ అని ప్రశ్నించింది. ఎస్‌‌ఎంసీ ఉత్తర్వులు, నిబంధనల్లో పేర్కొన్నదానికి విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. థర్డ్‌‌ జెండర్‌‌ వారి పట్ల దయతో కాకుండా వారి స్థానంలో ఉండి నిర్ణయం తీసుకోవాలని, మంగళవారం సమగ్ర వివరాలు అందజేయాలని ఎన్‌‌ఎంసీకి ఉత్తర్వులు జారీ చేసింది.