గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ప్రొఫెసర్హోదాల్లో ఉన్న డాక్టర్లు సమయానికి రావడంలేదు. ఉదయం 9 గంటలకు రావాల్సిన వారు గంటకు పైగా ఆలస్యంగా వస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సింది పోయి.. గంట ముందే ఇంటి దారి పడుతున్నారు. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లలో ఇదే తంతు నడుస్తున్నది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ద్వారా రన్ అవుతున్న ఆధార్ బేస్ట్ రియల్ టైమ్ అటెండెన్స్ సిస్టమ్ లో ఈ విషయం బయటపడింది.
ఉదయం సగటున10.12 గంటలకు డాక్టర్లు హాస్పిటల్ కు వస్తున్నారని, సాయంత్రం 2.55 కే బయట పడ్తున్నారని తేలింది. డాక్టర్లు, సిబ్బంది టైమ్ సెన్స్ పాటించకపోవడంతో ట్రీట్మెంట్ కోసం వచ్చే రోగులు, పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలకే పరిమితం కాలేదు. పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సైతం ఆలస్యంగా విధులకు హాజరవుతున్నట్టు ఎన్ఎంసీ డేటా స్పష్టం చేసింది. కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పోలిస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఇన్ టైమ్, అవుట్ టైమ్, స్టే టైమ్.. కాస్త మెరుగ్గా ఉంది.
డ్యూటీలో ఉంటున్నది నాలున్నర గంటలే..
రూల్స్ ప్రకారం డాక్టర్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాలి. అంటే ఏడు గంటల పాటు డ్యూటీలో ఉండాలి. కానీ, ఎన్ఎంసీ డేటా ప్రకారం.. రాష్ట్రంలోని 34 కాలేజీల్లో వీరి సగటు అటెండెన్స్ సమయం (స్టే టైమ్) కేవలం నాలుగున్నర గంటలు మాత్రమే. సగటున ఉదయం 10:12 గంటలకు కాలేజీకి వస్తూ.. మధ్యాహ్నం 2:55 గంటలకే లాగౌట్ చేసి వెళ్లిపోతున్నారు.
అంటే ప్రతిరోజూ రెండున్నర గంటల డ్యూటీకి కోత పెడుతున్నారు. టీచింగ్ హాస్పిటళ్లలో రోగులకు ట్రీట్మెంట్అందించడంతో పాటు, మెడికల్ విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంది. కానీ, డ్యూటీకే డుమ్మా కొడుతుండడంతో అటు వైద్య సేవలు, ఇటు బోధన రెండూ అటకెక్కుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
టచ్ అండ్ గో !
మెడికల్ కాలేజీల్లో గతంలో ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ సిస్టమ్ ఉండేది. అందులో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన ఎన్ఎంసీ.. పకడ్బందీగా ఉండేందుకు ఆధార్ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ను అమల్లోకి తెచ్చింది. కొన్ని నెలలుగా మెడికల్ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్ సిస్టం అమలవుతోంది. కానీ, కొందరు ఈ టెక్నాలజీలోనూ లొసుగులు వెతికి కొత్త దందాకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాలేజీ ఆవరణలోకి రాగానే ఫేషియల్ రికగ్నిషన్ యాప్ లో లాగిన్ చేసి, నిమిషాల వ్యవధిలోనే లాగౌట్ చేసి తమ ప్రైవేట్ ప్రాక్టీసులకు, సొంత పనులకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని ‘టచ్ అండ్ గో’ దందా అని మెడికల్కాలేజీల్లోనే పేరు పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటెండెన్స్ వేసి వెళ్లిపోతున్నా... స్టే టైమ్‌లో మాత్రం వీరు దొరికిపోతున్నారు.
ప్రభుత్వ లక్ష్యానికి గండి
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వేలాది నియామకాలు చేపడుతూ, సీట్లను పెంచుతూ, ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, క్షేత్రస్థాయిలో ప్రొఫెసర్లు, వారిని పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుందనే విమర్శలు వస్తున్నాయి.
ఎన్ఎంసీ పోర్టల్ లో అటెండెన్స్ వివరాలు ప్రతిక్షణం పబ్లిక్‌గా కనిపిస్తున్నా.. ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ టచ్ అండ్ గో దందాకు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఉద్దేశపూర్వకమా? టెక్నికల్ ప్రాబ్లమా?
కొన్ని కాలేజీల్లో స్టే టైమ్ సెకన్లలో, నిమిషాల్లో నమోదవడం గందరగోళానికి తావిస్తోంది. కామారెడ్డి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల సగటు స్టే టైమ్ కేవలం 16 సెకన్లు కాగా.. నాగర్‌కర్నూల్ లో 17 సెకన్లు, యాదాద్రిలో 18 సెకన్లు, నర్సంపేటలో 32 సెకన్లుగా నమోదవడం విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు ఇన్ టైమ్ విషయంలోనూ కొన్ని కాలేజీల్లో విచిత్రకర డేటా నమోదవుతోంది. నర్సంపేటలో ఏకంగా మధ్యాహ్నం 12:46 గంటలకు ఇన్- టైమ్ నమోదైంది.
మహేశ్వరం కాలేజీలో ఉదయం 9:39 గంటలకే ఔట్-టైమ్ చూపిస్తుండడం గమనార్హం. ఇది ప్రొఫెసర్లు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అక్రమమా? లేక ఎన్ఎంసీ పోర్టల్ లోని టెక్నికల్ ఇష్యూనా? అనేది వైద్యాధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది టెక్నికల్ సమస్య కాకపోతే.. ఇంత పెద్ద మొత్తంలో డ్యూటీ ఎగ్గొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
