టమాట.. నిన్నా మొన్నటి వరకు కేజీ 2, 3 రూపాయలు.. ధరలు లేక రైతులు తమ టమాటా పంటను సైతం పారబోశారు.. ఇదంతా 15 రోజుల క్రితం.. ఇప్పుడు సీన్ మారిపోయింది. దేశ వ్యాప్తంగా టమాటా ధరల మంట మొదలైంది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో టమాటా ధరలు తారాజువ్వ మాదిరి పైపైకి పెరుగుతుంది.
15 రోజుల క్రితం.. అంటే 2025, నవంబర్ మొదటి వారంలో కేజీ టమాట ధర 20 నుంచి 30 రూపాయలుగా ఉంది. ఇప్పుడు అది గల్లీ మార్కెట్ లో కేజీ 50 రూపాయలకు చేరింది. జస్ట్ 15 రోజుల్లోనే ధర 50 శాతంపైనే పెరగటంతో వినియోగదారులు అవాక్కయ్యారు.
దేశవ్యాప్తంగా టమాట మంటలు పుట్టాయి. ఆయా రాష్ట్రాల్లో డిమాండ్, సప్లయ్ ఆధారంగా తీసుకున్నా.. 15 రోజుల్లోనే 27 శాతం నికరంగా ధర పెరిగినట్లు డేటా చెబుతోంది. ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే.. చండీగఢ్ లో 112 శాతం ధర పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 శాతం ధర పెరిగింది. ఇక హిమాచల్ ప్రదేశ్ లోనూ 15 రోజుల్లోనే.. 40 శాతం ధర పెరిగింది టమాట.
ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే.. నవంబర్ నెల మొదటి వారం 20 నుంచి 25 రూపాయలుగా ఉంది. ఇప్పుడు హోల్ సేల్ ధర 32 రూపాయలకు చేరింది. ఇక రిటైల్ ధర తీసుకుంటే.. ఆయా క్వాలిటీ ఆధారంగా 35 నుంచి 45 రూపాయల మధ్య పలుకుతుంది. షాపింగ్ మాల్స్ లో అయితే కేజీ టమాటా 50 రూపాయల వరకు ఉంది. టమాట రకం.. గ్రేడ్ ఆధారంగా కేజీ 50 రూపాయలను టచ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోనూ 40 నుంచి 50 శాతం ధర పెరగటం వినియోగదారులకు కష్టంగా మారింది.
టమాట ధర పెరగటానికి కారణం :
మొన్నటి వరకు పడిన వర్షాలు, తుఫాన్ కారణంగా పంట చాలా నష్టపోయింది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోయింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రా, గుజరాత్ రాష్ట్రాల్లో పంట దిగుబడి తగ్గింది. దీనికితోడు పెళ్లిళ్ల సీజన్. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాబోయే నెల రోజుల్లో అంటే.. డిసెంబర్ 15వ తేదీ నాటికి కిలో టమాట 80 నుంచి 100 రూపాయలు టచ్ అయినా ఆశ్చర్యం లేదని ఆజాద్ పూర్ టమాట ట్రేడర్స్ అసోసియేషన్ చైర్మన్ అశోక్ కోషిక్ వెల్లడించారు. ఉత్తర భారతదేశంలో పంట నష్టం తీవ్రంగా ఉందని.. ఈ సీజన్ లో రెగ్యులర్ గా ఆజాద్ పూర్ మార్కెట్ కు రోజుకు 10 ట్రక్కుల టమాట రావాల్సి ఉండగా.. ఇప్పుడు 4, 5 ట్రక్కులు మాత్రమే వస్తున్నాయని.. సగానికి సగం పంట తగ్గిందని.. అందుకే ధరలు పెరిగాయని వెల్లడించారాయన.
