- 80% మంది టైమ్‌కు ట్రీట్ మెంట్ తీసుకోవడం లేదన్న ఎక్స్ పర్ట్స్
- 10% కంటే తక్కువ మందికే అందుతున్న చికిత్స
- పిల్లలు, యవకులు, వృద్ధుల్లోనూ మానసిక సమస్యలు
- నేషనల్ మెంటల్ హెల్త్ సర్వేలో వివరాల వెల్లడి
న్యూఢిల్లీ: మానసిక సమస్యలు, మానసిక వ్యాధులను భారతీయులు అతి సాధారణంగా పరిగణిస్తున్నారు. వాటి గురించి పట్టించుకోవడం లేదు. దాదాపుగా 80– 85% మంది వ్యక్తులు సకాలంలో మానసిక రుగ్మతలకు ట్రీట్ మెంట్ తీసుకోవడం లేదని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నిర్వహించిన నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే (ఎన్ఎంహెచ్ఎస్)లో తేలింది.
ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షెన్ సెంటర్లో జనవరి 28–31 వరకు ద ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (ఐపీఎస్)77వ వార్షిక జాతీయ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ లో ఎన్ఎంహెచ్ఎస్ వివరాలను ద ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (ఐపీఎస్) ఎక్స్ పర్ట్స్ వెల్లడించారు.
చికిత్స తీసుకోవడానికి ఇష్టపడని భారతీయులు
ట్రీట్మెంట్లలో పురోగతి, అవేర్ నెస్ పెరిగినప్పటికీ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడం లేదని మెంటల్ హెల్త్ ఎక్స్ పర్ట్స్ తెలిపారు. ప్రపంచదేశాలతో పోల్చుకుంటే ఇండియాలో వీరి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్ఎంహెచ్ఎస్ డేటాను ఆధారంగా చేసుకుని ఎక్స్ పర్ట్స్ ఈ వివరాలను వెల్లడించారు.
మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారిలో 85% మంది వాటి గురించి పట్టించుకోవడం లేదు.. ట్రీట్ మెంట్ కూడా తీసుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నవారిలో 70% కంటే ఎక్కువ మందికి శిక్షణ పొందిన డాక్టర్ల నుంచి చికిత్స అందడం లేదు. వాస్తవంగా10% కంటే తక్కువ మందికి మాత్రమే ట్రీట్ మెంట్ లభిస్తున్నది.
భిన్నంగా చూస్తారనే అభిప్రాయంతోనే వెనుకడుగు
భారత్ లో అధికంగా జనాభా ఉండటం, పరిమితంగా మెంటల్ హెల్త్ ఇన్ఫాస్ట్రక్చర్ ఉండటం మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి చికిత్స అందడం లేదు. వివక్ష, తక్కువ ఆదాయం ఉండటం, అవేర్ నెస్ లేకపోవడం, ఇల్లు, పని ప్రదేశాల్లో తమను భిన్నంగా చూస్తారనే అభిప్రాయంతో ఈ సమస్యల గురించి బయటకు చెప్పుకోవడం లేదు. మానసిక సమస్యలను ముందుగానే గుర్తించి ట్రీట్ మెంట్ అందిస్తే నయం చేయొచ్చని ద ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ సవితా మల్హోత్రా తెలిపారు.
కానీ, భారతీయుల్లో ఎక్కువ మంది ఆ సమస్యల గురించి బయటకు కూడా చెప్పుకోవడం లేదని.. ఆ బాధను మౌనంగానే భరిస్తున్నారని చెప్పారు. వివక్ష, అవగాహన లోపం, ప్రాథమిక ఆరోగ్య సేవల్లో మెంటల్ హెల్త్ ను చేర్చకపోవడం వంటి కారణాలతో 80% మంది భారతీయులకు ట్రీట్ మెంట్ అందడం లేదని పేర్కొన్నారు.ఇది మెడికల్ సమస్య మాత్రమే కాదని.. సామాజిక, ఆర్థిక, అభివృద్ధికి సంబంధించిన అంశమని వెల్లడించారు. దీనిపై జాతీయ స్థాయిలో దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
అవగాహన లోపమే అసలు కారణం
మానసిక సమస్యలు ఉన్నవారిలో చాలా మంది ప్రాథమిక లక్షణాలను గుర్తించడంలో విఫలమవుతున్నారు. అవగాహన లేకపోవడం కూడా ఆ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నది. ఇండియాలో మెడికల్ ఎక్స్ పర్ట్స్ కొరత ఉండటం కూడా ఒక కారణం. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోకపోవడం లేదా ఆలస్యంగా తీసుకుంటే కలిగే తీవ్రమైన పరిణామాలను ద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐహెచ్ బీఎస్) మాజీ డైరెక్టర్ డాక్టర్ నిమేశ్ దేశాయ్ హైలైట్ చేశారు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం ఆలస్యమైతే అది దీర్ఘకాలికంగా మారుతుందని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులు బాధను అనుభవించడం, ఉత్పాదకతను కోల్పోవడం, ఆత్మహత్య చేసుకునే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని చెప్పారు.
ఇన్ఫాస్ట్రక్చర్ ను మెరుగుపరిస్తేనే ట్రీట్ మెంట్ చేరువ
సాధారణ రోగాల మాదిరిగానే మెంటల్ హెల్త్ ను కూడా సీరియస్ గా తీసుకోవాలి. కమ్యూనిటీ ఆధారిత సేవలను బలోపేతం చేయడం, ప్రైమరీ హెల్త్ కేర్ డాక్టర్లకు శిక్షణ ఇవ్వడం, రిఫరల్ వ్యవస్థలను మెరుగుపరిస్తే మానసిక సమస్యలతో బాధపడుతున్నవారిలో ఎక్కువ మందికి చికిత్స అందుతుందని పేర్కొన్నారు. వివక్షను పారద్రోలడంతో పాటు మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి ట్రీట్ మెంట్ ను చేరువ చేయడానికి మెంటల్ హెల్త్ ఇన్ఫాస్ట్రక్చర్ ను మెరుగుపర్చాలని హోప్ కేర్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ దీపక్ రహేజా వెల్లడించారు.
వివక్షను తగ్గించడంతో పాటు మెంటల్ హెల్త్ కేర్ ను అందరికి చేరువ చేయడానికి వీటిని ప్రైమరీ హెల్త్ కేర్ లో ఏకీకృతం చేయాలని వివరించారు. బడ్జెట్ కేటాయింపులను పెంచడంతో పాటు మెంటల్ హెల్త్ సిబ్బందికి భారీ స్థాయిలో చికిత్స అందించాలని, దేశవ్యాప్తంగా నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.
చికిత్స తీసుకోనివారు అట్టడుగు వర్గాల్లోనే ఎక్కువ
మానసిక సమస్యలకు ట్రీట్ మెంట్ తీసుకోనివారు అట్టడుగు వర్గాల్లోనే ఎక్కువగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో దాదాపు 80% మంది పిల్లలు, యువకులు ఎటువంటి చికిత్స తీసుకోవడంలేదు. ఇది వారి విద్య, దీర్ఘకాలిక జీవితం పై ప్రభవం చూపిస్తున్నది. ఇండియాలో మానసిక సమస్యలు ఉన్న వృద్ధుల్లో దాదాపు 84 శాతం మంది ఎటువంటి ట్రీట్ మెంట్ తీసుకోవడం లేదు.
నిర్లక్ష్యం, అవగాహన లేకపోవడం, వృద్ధాప్యంలో మానసిక సమస్యలు సహజమనే తప్పుడు భావనతో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ట్రీట్ మెంట్ ఆలస్యమయ్యే కొద్ది దాని ప్రభావం కుటుంబంపై మాత్రమే కాకుండా సొసైటీ, ఎకానమీపై ఉంటుంది.
ట్రీట్ మెంట్ తీసుకోకపోతే సూసైడ్ ముప్పు
మానసిక సమస్యలకు చికిత్స తీసుకోకపోతే అనారోగ్యం, మరణాలు, నిరుద్యోగం, కుటుంబం విచ్ఛిన్నం కావడం, ఆత్మహత్యలకు దారితీయొచ్చని ఎక్స్ పర్ట్స్ తెలిపారు. నేషనల్ మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ టెలీమానస్, డిస్ట్రిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ను విస్తరించడం, మెంటల్ హెల్త్ పై మరింత ఫోకస్ పెంచడం సానుకూల నిర్ణయాలని ద ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ నిపుణులు పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్ ను తట్టుకోవడానికి అనుగుణంగా ఈ ప్రయత్నాలను గణనీయంగా పెంచాలని సూచించారు.
