జీతాలివ్వలేని కేసీఆర్​కు దేశ రాజకీయాలా?:

జీతాలివ్వలేని కేసీఆర్​కు దేశ రాజకీయాలా?:
  • మునుగోడులో బీజేపీదే విజయం: వివేక్​ వెంకటస్వామి

మునుగోడు, వెలుగు: కేసీఆర్, టీఆర్ఎస్ కనుమరుగయ్యేలా మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు తీర్పు ఇవ్వాలని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజలమీద నమ్మకంతో రాజీనామా చేశానని, మునుగోడు ప్రజలు ధర్మంవైపు,  న్యాయం వైపు నిలబడాలని కోరారు. సోమవారం మునుగోడు క్యాంప్ ఆఫీసులో ఆయన ఎన్నికల ఇన్​చార్జ్​​ వివేక్​ వెంకటస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. మునుగోడు బైపోల్​కు  భయపడి సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు పోతారని భావిస్తున్న తరుణంలో బైపోల్​ షెడ్యూల్​ రావడం సంతోషంగా ఉందని అన్నారు. మునుగోడు ఎన్నిక తెలంగాణ భవిష్యత్​కు సంబంధించిన ఎన్నికని, కేసీఆర్​ అవినీతి, నియంతృత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని కోరారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని కేసీఆర్​ దేశ రాజకీయాలు చేస్తానని బయలుదేరడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. గ్రామాల్లో బెల్ట్​షాపులు పెట్టి ప్రజలను తాగుబోతులను చేశారని, మద్యం డబ్బులతో బడ్జెట్ పెంచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉద్యమంలో పాల్గొన్నవారిని కేసీఆర్​ గుర్తించడంలేదని, టీఆర్​ఎస్ పాలన దుర్మార్గంగా ఉందన్నారు. మునుగోడులో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు సాధించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ నేతలు వీరెల్లి చంద్రశేఖర్​, గోలి మధుసూదన్​రెడ్డి, బండారు ప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.

విమానం కొనేందుకు వంద కోట్లెక్కడివి?: వివేక్​ వెంకటస్వామి

కేసీఆర్  జాతీయ పార్టీ పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని, చిన్న ప్రాంతీయ పార్టీ నేత రూ. 100 కోట్లతో విమానం కొనడం ఎట్లా సాధ్యమన్న చర్చ జరుగుతున్నదని మునుగోడు బైపోల్​ స్టీరింగ్​ కమిటీ చైర్మన్​ వివేక్​ వెంకటస్వామి అన్నారు. అవినీతి అక్రమాలలో సీఎం కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని దుయ్యబట్టారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్​ కుటుంబం వేల కోట్లు కమీషన్ తీసుకున్నదని ఆరోపించారు. మిషన్ భగీరథ పథకానికి లక్షల కోట్లు ఖర్చు చేసినా..  గ్రామాల్లో ప్రజలకు తాగునీరు ఇవ్వడంలో విఫలమయ్యారని అన్నారు. పాత ట్యాంకులకు కొత్త రంగులు వేసి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం నెలకు రూ. 30 లక్షలు జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేవారు. ఉన్న సెక్రటేరియట్​ను కూల్చేసి కోట్లల్లో ఖర్చు చేసి ఇష్టానుసారం కొత్త సెక్రటేరియట్​ కడుతున్నారని విమర్శించారు. దళిత బంధు, గిరిజనబంధు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపే ఉన్నారని, ఈ ఎన్నికలో బీజేపీ గెలవడం ఖాయమని వివేక్​ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు.