బెంగాల్ ​హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కె. లక్ష్మణ్

బెంగాల్ ​హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కె. లక్ష్మణ్

అంబర్​పేట, వెలుగు: బీజేపీ ఎప్పుడూ మైనార్టీలకు వ్యతిరేకం కాదని రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. మతపరమైన రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన ప్రతిసారి, ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై దుష్ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మైనార్టీల పేరుతో బీసీలకు అన్యాయం చేస్తే సహించమని చెప్పారు. మైనారిటీలకు ఓబీసీ హోదాను రద్దు చేస్తూ పశ్చిమబెంగాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు.

హైకోర్టు తీర్పుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ  వైఖరిని నిరసిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు గురువారం అంబర్​పేటలోని జ్యోతిబాఫూలే విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి లక్ష్మణ్ నిరసన తెలిపారు. రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. మమత బెనర్జీ వైఖరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు.  నిరసన కార్యక్రమంలో బీజేపీ నేతలు గౌతమ్ రావు, జమాల్పూర్ నందు, రమేశ్​గౌడ్, ఉమేశ్, చారి, వాసు తదితరులు పాల్గొన్నారు.