సైన్స్​తోనే సమాజ పురోగతి

సైన్స్​తోనే సమాజ పురోగతి

భారతదేశ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర్ వెంకట రామన్ తాను కనుగొన్న “రామన్ ఎఫెక్ట్” అనే కొత్త సైంటిఫిక్ ఆవిష్కరణను 1928వ సంవత్సరం ఫిబ్రవరి 28న ప్రకటించారు. ఈ కొత్త ఆవిష్కరణకు 1930వ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో సీవీ రామన్​కు నోబెల్ బహుమతి వచ్చింది. సీవీ రామన్ సైన్స్​ రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి భారతీయుడిగా నిలిచాడు. కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ప్రయోగశాలలో పనిచేస్తున్నప్పుడు ఈ బహుమతిని గెలుచుకున్నారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

రామన్ ఎఫెక్ట్: 1921వ  సంవత్సరంలో సర్  సీవీ రామన్ ఆక్సఫర్డ్​లో నిర్వహించిన  విశ్వవిద్యాలయాల కాంగ్రెస్​లో పాల్గొని తిరుగు ప్రయాణంలో మధ్యధరా సముద్రం మీదుగా ఓడలో వస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న సముద్రపు నీరు  నీలిరంగులో ఉండటాన్ని గమనించారు. దాని ఫలితంగానే రామన్ ఎఫెక్ట్ అనే విషయం కనుగొనడమైంది. సముద్రంలోని నీటి అణువులు నీలి రంగు కాంతిని విరజిమ్మటం వలన సముద్రం నీలి రంగులో కనిపిస్తుందని సి.వి.రామన్ భావించాడు. తనకు తట్టిన ఆలోచన నిజమో, కాదో తెలుసుకోవడానికి సముద్రం నుంచి నీటిని సేకరించి కొన్ని ప్రయోగాలు చేశాడు. ఒక నిర్దిష్ట తరంగదైర్ఘ్యంగల కాంతిని ఒక పదార్థంపై పడేటట్టు చేస్తే ఆ పదార్థం వెదజల్లే లేదా విడుదల చేసే కాంతి తరంగదైర్ఘ్యం, ఆ పదార్థంపై పడిన కాంతి లేదా పతనకాంతి తరంగదైర్ఘ్యం కంటే తక్కువ లేదా ఎక్కువగా ఉండడాన్ని రామన్ గమనించాడు. అంతేకాక పదార్థంపై పడిన కాంతి తరంగదైర్ఘ్యంకి, పదార్థం వెదజల్లే కాంతి  తరంగదైర్ఘ్యంకి మధ్య  తేడా,  ఉపయోగించిన పదార్థంపై ఆధారపడుతుంది అని, అంతేగానీ ఉపయోగించిన కాంతి మీద ఆధారపడదు అని నిరూపించాడు. పదార్థం వెదజల్లే లేదా విడుదల చేసే కాంతి తరంగదైర్ఘ్యం ఆ పదార్థం, కారెక్టర్ స్టిక్ ప్రాపర్టీపై ఆధారపడి ఉంటుంది. దీనినే రామన్ ఎఫెక్ట్ అని అంటారు.

‘స్వదేశీ టెక్నాలజీస్​ ఫర్​ వికసిత్​ భారత్’​

ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌తో జాతీయ సైన్స్ ‌దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. 2024వ సంవత్సరపు జాతీయ సైన్స్ దినోత్సవ థీమ్​‘స్వదేశీ టెక్నాలజీస్​ ఫర్​ వికసిత్​ భారత్​’. దేశీయ సాంకేతికతను ఉపయోగించి సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో మన శాస్త్రవేత్తలు సాధించిన విజయాన్నిఈ థీమ్‌ తెలియజేస్తోంది. గత పది సంవత్సరాల కాలంలో సైంటిఫిక్ రంగంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. భారతదేశం శాస్త్రీయ పరిశోధన ప్రచురణలలో ప్రపంచవ్యాప్తంగా మొదటి ఐదు దేశాలలో ఉన్నది, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (G.I.I.జీ.ఐ.ఐ)లో 40వ స్థానంలో ఉన్నది, 2015లో 81వ ర్యాంక్ సాధించిన భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. భారతదేశ పేటెంట్ ఫైలింగ్ 90,000 దాటింది, ఇది రెండు దశాబ్దాలలో అత్యధికం.

జాతీయ సైన్స్ దినోత్సవం ముఖ్య ఉద్దేశం

1. ప్రజల దైనందిన జీవితంలో, సమాజ అభివృద్ధిలో సైన్స్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం.  2. మానవ సంక్షేమం కోసం సైన్స్ రంగంలో జరిగిన విజయాలను ప్రదర్శించి ప్రజలకు సైన్స్ పట్ల అవగాహన, ఆసక్తిని పెంపొందించడం. 3. దేశంలోని శాస్త్రీయ దృక్పథం ఉన్న పౌరులను ప్రోత్సహించడం సైన్స్ అండ్ టెక్నాలజీని  ప్రాచుర్యంలోకి తీసుకురావడం.

సమాజం కోసం సైన్స్

యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్(యునెస్కో) వారి ప్రకారం,  సైన్స్ అనేది గొప్ప సామూహిక  ప్రయత్నం. ఇది సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితానికి భరోసా ఇస్తుంది, ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చటంలో సైన్స్ సహాయపడుతుంది. సైన్స్ మనం తినే ఆహారంతో సహా శక్తిని అందిస్తుంది. క్రీడలతో సహా జీవితాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తోంది.  సైన్స్ రోజువారీ జీవితానికి పరిష్కారాలను రూపొందిస్తుంది, విశ్వం గొప్ప రహస్యాలకు సమాధానం ఇవ్వడానికి  సహాయపడుతోంది. మరో మాటలో చెప్పాలంటే, విజ్ఞానం అత్యంత ముఖ్యమైన మార్గాలలో సైన్స్ ఒకటి. సైన్స్ మనకు కావలసిన కొత్త పరిజ్ఞానాన్ని సృష్టించడంతో పాటు మెరుగైన విద్యను, మన జీవిత నాణ్యతను పెంచుతుంది.

21వ శతాబ్దంలో పెరిగిన నైపుణ్యాలు

సైన్స్ అం‌టే ఏ ఒక్క విభాగం మాత్రమే కాదు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, జీవశాస్త్రం, ఆస్ట్రోఫిజిక్స్, భూగర్భశాస్త్రం, టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, పశువిజ్ఞానం ఇలా పలు రంగాలలో సైన్స్ ‌విస్తరించి ఉంటుంది. వాతావరణం, తుపానులు పసిగట్టడం, ప్రకృతి విపత్తులను ముందుగానే  తెలుసుకోవటం, ప్రమాదాలు సంభవిస్తే  ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తగ్గించడం కూడా సైన్స్ ‌గానే పరిగణించాలి.  మారుతున్న నేటి ప్రపంచంలో సైన్స్, టెక్నాలజీ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.  సమాజంలో మనం చూసే దాదాపు ప్రతిదీ అప్లైడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫలితమే.  సైన్స్ మన జీవితాలను సులభతరం చేసింది. శాస్త్రీయ ఆవిష్కరణలు సాంకేతిక పురోగతితో కలిపినప్పుడు, యంత్రాలు సృష్టించబడి అవి  మన జీవితాలను సులభతరంగా మార్చి వేసినవి.  సైన్స్ గృహోపకరణాల నుంచి ఆటోమొబైల్స్, విమానాల వరకు ప్రతిదీ సృష్టించింది. సైన్స్​లో పురోగతి కారణంగా రైతులు ఇప్పుడు తమ పంటలను తెగుళ్లు, ఇతర సమస్యల నుంచి రక్షించుకొని అధికంగా దిగుబడిని పొంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోగలుగుతున్నారు. విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం నైపుణ్యాలు, సమాచార అక్షరాస్యత వంటి అనేకం 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించుకోవటంలో  సైన్స్ ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ప్రకృతి ఆరాధనలో సైన్స్​

 భూమి కి ప్రధాన శక్తి వనరు సూర్యుడు. సూర్యుడిలో జరిగే కేంద్ర సంలీనం అనే రసాయన చర్య ద్వారా సూర్యుడు నిత్యం మనకు కాంతిని వెదజల్లుతున్నాడు. ఈ సూర్యశక్తిని వినియోగించుకొని వృక్షాలు కిరణజన్య సంయోగక్రియ  ద్వారా భూమిపై గల జీవజాతులకు అవసరమైన  ఆక్సిజన్ వాయువును, ఆహారాన్ని అందిస్తున్నాయి. అదేవిధంగా భూమిపై గల జీవజాతులు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ ను  వృక్షాలు గ్రహించి దానిని కిరణజన్య సంయోగక్రియలో తిరిగి ఉపయోగించుకుంటాయి. దీనివల్ల భూమిపై కార్బన్ డయాక్సైడ్ వాయువు పరిమాణం పెరగదు. మొక్కలు కూడా  జీవంగలవని జగదీశ్​చంద్రబోస్ అనే భారతీయ శాస్త్రవేత్త విజ్ఞానశాస్త్ర పరంగా   నిరూపించాడు. ఈ విధంగా భూమిపై గల జీవరాశులకు ఎంతో మేలు చేస్తూ ప్రకృతిలో భాగమైన సూర్యుడిని, వృక్షాలను పూజించే ఆచారం ఉంది.  అంటే  సమాజం ఆచరించే కొన్ని మతాచారాలు విజ్ఞాన శాస్త్రంతో కూడుకున్నవే. అలాంటి మతాచారాలు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడతాయి కూడా. సైన్స్ లేని మతాచారాలను మూఢ విశ్వాసాలుగా భావించవచ్చు. వీటివల్ల సమాజాభివృద్ధికి అపారమైన నష్టం వాటిల్లుతున్నది. ఉదాహరణకు  చేతబడి, బాణామతి,  దెయ్యం పట్టడం వంటివి.

ఆచారాల్లోనూ సైన్స్ ఉంది

సైన్స్,  మతం మధ్య చాలా అంతరం ఉన్నట్లు కనిపిస్తోంది. సైన్స్ వాస్తవాన్ని సూచిస్తుంది, ప్రాథమికంగా తర్కం, కారణం మీద ఆధారపడి ఉంటుంది. కానీ, మతం పూర్తిగా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఆచరించే కొన్ని మతాచారాలకు, సైన్స్​కు మధ్య పోలికలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఉపవాస దీక్ష అనేది అన్ని మతాల వారు  ఆచరించేది. ఉపవాసంను వైద్య భాషలో “ఆటోఫాజీ” అని వ్యవహరిస్తారు. ఈ విధానాన్ని కనుగొన్నందుకు 2016 సంవత్సరంలో “యోషినోరి ఓహ్సుమీ” అనే జపాన్ దేశ శాస్త్రవేత్తకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించడం జరిగింది.  చక్కెర వ్యాధి, బీపీ , క్యాన్సర్, ఊబకాయం  వంటి  అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఉపవాసం  దివ్య ఔషధంగా పనిచేస్తుందని ప్రస్తుత కాలంలో వైద్యరంగంలో ఈ పద్ధతిని విరివిగా ఉపయోగిస్తున్నారు.

సీవీ రామన్​ మనకు ఆదర్శం

సామాజిక అవసరాలు, ప్రపంచ సవాళ్లకు సైన్స్ ప్రతిస్పందించాలి. ఆరోగ్యం, వ్యవసాయం వంటి సమస్యలపై నాణ్యమైన శాస్త్రీయ సమాచారం ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. వాతావరణ మార్పు, సముద్ర ఆరోగ్యం, జీవవైవిధ్య నష్టం, మంచినీటి భద్రత వంటి ప్రధాన ప్రపంచ సవాళ్ల వెనుక ఉన్న సైన్స్ ను జాతీయ ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. సుస్థిర అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు, పౌరులు ఒకే విధంగా సైన్స్ భాషను అర్థం చేసుకోవాలి. సైంటిఫిక్ గా  అక్షరాస్యులు కావాలి.సైన్స్ అనేది కేవలం ప్రయోగ శాలలకే పరిమితం కాదు. మన చుట్టూ ఉన్న  పరిసరాలే ఒక పెద్ద ప్రయోగశాల.  కాబట్టి విద్యార్థులు తమ చుట్టూ ఉన్న ప్రకృతిలోని విషయాలను గమనించి వాటిని విశ్లేషించుకోవడం వలన కొత్త సైంటిఫిక్ విషయాలు ఆవిష్కరించబడతాయి. దీనికి మంచి ఉదాహరణ సీవీ రామన్ తాను పరిశీలించిన సముద్రపు నీరు నీలి రంగు, రామన్ ఎఫెక్ట్ అనే ఆవిష్కరణకు దారితీసింది.   ప్రజలు ప్రతిది శాస్త్రీయంగా ఆలోచించి శాస్త్రీయ జీవనశైలిని అలవర్చుకున్నట్లయితే సమాజం ఎంతో పురోగతిని సాధిస్తుంది.

- డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్