- 27 నుంచి 30 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పోటీలు
హైదరాబాద్, వెలుగు: భాగ్యనగరం మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. సీనియర్ నేషనల్ విమెన్స్ కబడ్డీ చాంపియన్‌షిప్ ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది.30 స్టేట్ టీమ్స్ నుంచి 464 మంది ప్లేయర్లు బరిలో నిలిచిన టోర్నీ బ్రోచర్‌ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి.. శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని వీరేశ్, జనరల్ సెక్రటరీ మహేందర్ రెడ్డి తో కలిసి శనివారం రిలీజ్ చేశారు.
తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ఖ్యాతిని పెంచేలా ఈ టోర్నీ నిర్వహణకు సహకారం అందిస్తుందన్నారు. ఈ నెల 27న ఓపెనింగ్, 28, 29న లీగ్ మ్యాచ్‌లు, 30 నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయని వీరేశ్, మహేందర్ రెడ్డి తెలిపారు. నాకౌట్ రౌండ్ మ్యాచ్‌లు జియో హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో శాట్స్ ఎండీ సోనిబాలా దేవి, ఇండియా కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ప్లేయర్ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
