నిర్మల్, వెలుగు: బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లను, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నవ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. నిర్మల్లోని ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం బీసీల సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ.. వెంటనే శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
ప్రతి ఏడాది బడ్జెట్ లో బీసీలకు రూ.20వేల కోట్లు కేటాయించాలని, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్ష నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మద్దతు తెలిపారు. దీక్షలో బీసీ సంఘ రాష్ట్ర నేత, ఓయూ విద్యార్థి సంఘం మాజీ నేత రాజారాం యాదవ్, ఆలిండియా నవ సంఘర్షణ సమితి చైర్మన్ పంజాల జైహింద్, బీసీ సంఘ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.