35 మంది పైరేట్లను బంధించి ముంబైకి తెచ్చిన నేవీ షిప్​

35 మంది పైరేట్లను బంధించి ముంబైకి తెచ్చిన నేవీ షిప్​

ముంబై: సోమాలియా సముద్రపు దొంగలు(పైరేట్స్) 35 మందితో కూడిన భారత యుద్ధ నౌక ఐఎన్‌‌ఎస్ కోల్‌‌కతా శనివారం ఉదయం ముంబైకి చేరుకుంది. ఈ దొంగలందరినీ ముంబై పోలీసులకు అప్పగించినట్టు ఇండియన్ నేవీ పేర్కొంది. వారిపై మారిటైమ్ యాంటీ పైరసీ యాక్ట్ 2022 ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. గత ఏడాది డిసెంబర్​లో ఎక్స్‌‌-ఎంవీ రూయెన్‌‌ నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.

ఇతర దేశాల నౌకలను దోచుకునేందుకు దానిని ఉపయోగించారు. గత వారం కూడా ఈ దొంగలు బల్గేరియన్ నౌకను హైజాక్ చేశారు. అందులోని ప్యాసింజర్లను నిర్బంధించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇండియన్ నేవీ సముద్రపు దొంగలు నిర్బంధించిన వారిని విడిపించడానికి 'ఆపరేషన్ సంకల్ప్' చేపట్టింది. ఈ నెల 15న ఐఎన్‌‌ఎస్ కోల్‌‌కతా, ఐఎన్ఎస్ సుభద్ర, పీ81 విమానం, సీ గార్డియన్ యూఏవీతోపాటు పలు ఆధునిక డ్రోన్ల సాయంతో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఎక్స్‌‌-ఎంవీ రూయెన్‌‌ నౌకను చుట్టుముట్టింది. 40గంటల పాటు ఆపరేషన్ చేపట్టి 35 మంది సముద్రపు దొంగలను బంధించింది. వారిని ఐఎన్‌‌ఎస్ కోల్‌‌కతా నౌకలో ముంబైకి తరలించి పోలీసులకు అప్పగించింది.

110 మందిని కాపాడినం

ఆపరేషన్ సంకల్ప్​తో పాటు ఇతర మిషన్ల కింద ఇప్పటిదాకా 13 పైరేట్స్ వ్యతిరేక ఆపరేషన్స్ నిర్వహించినట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది. ఈ ఆపరేషన్స్ ద్వారా 110 మంది ప్రాణాలను రక్షించామని తెలిపింది. ఇందులో  45 మంది భారతీయులుకాగా.. 65 మంది అంతర్జాతీయ పౌరులని పేర్కొంది. ఈ 65 మందిలో 27 మంది పాకిస్తానీయులు, 30 మంది ఇరానియన్లు ఉన్నారని వివరించింది.