ఏ తప్పూ చేయకున్నా...పాస్ పోర్ట్ బ్లాక్ చేశారు

ఏ తప్పూ చేయకున్నా...పాస్ పోర్ట్ బ్లాక్ చేశారు

తాను ఏ తప్పూ చేయకున్నా...పాస్ పోర్ట్ బ్లాక్ చేశారని ఫిలిప్పీన్స్ లో మెడిసిన్ చదువుతునన్న హైదరాబాద్ యువతి నవ్యదీప్తి వాపోయింది. తాను మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్నట్లు, ఫిలిప్పీన్స్ లో తాను ఉండే ఇంటి యజమాని తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని వెల్లడించింది. పాస్ పోర్టు బ్లాక్ అయ్యిందని మనిల్లా ఎయిర్ పోర్టు అధికారులు చెప్పడంతో ఆమె హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైంది. ఆమె నివాసం ఉండే వనస్థలిపురంలోని విజయపురి కాలనీకి చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే...తన మాదిరి చాలా మంది ఇబ్బంది పడుతారని పేర్కొంది. తనతో పాటు తన అక్కను ఫిలిప్పీన్స్ వెళ్లేలా సహకరించాలని ఆమె కోరింది. 

అసలేం జరిగింది ? 
మెడిసిన్ విద్యనభ్యసిస్తున్న ఆమె.. గత మూడేళ్లుగా పిలిప్పీన్స్ లో ఉంటోంది. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఆమె ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పడుతుండడం.. నిబంధనలు సడలించడంతో నవ్య తిరిగి ఫిలిప్పీన్స్ బయలుదేరింది. కానీ.. మనిల్లా ఎయిర్ పోర్టులో నవ్యను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పాస్ పోర్టు బ్లాక్ అయ్యింది.. తిరిగి ఇండియా వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో నవ్య ఎయిర్ పోర్టులోనే రాత్రి మొత్తం పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనిల్లా ప్రాంతంలో రెండేళ్లుగా ఓ ఇంట్లో నవ్య నివాసం ఉండేది. కోవిడ్ టైంలో అధిక ఛార్జ్ ఇవ్వాలని ఇంటి ఓనర్ ఒత్తిడి చేసింది. డబ్బులు అధికంగా ఇవ్వకపోతే పాస్ పోర్టు బ్లాక్ చేయిస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. డబ్బులు తాను ఇవ్వకపోవడంతో పాస్ పోర్టును బ్లాక్ చేశారని నవ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఫిలిప్పీన్స్ ఇమ్మిగ్రేషన్ శాఖలో పనిచేసే..ఇంటి యజమాని అధికార దుర్వినియోగం, పలుకుబడి తో పాస్ పోర్ట్ ను బ్లాక్ చేయించినట్టు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆమెతో పాటు అక్క భవ్య కీర్తి పాస్ పోర్ట్ కూడా అధికారులు బ్లాక్ చేశారు. మరి నవ్య దీప్తి సమస్య పరిష్కారమౌతుందా  లేదా ? అనేది చూడాలి.