
నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాజధాని నడిబొడ్డున ఉన్న ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చవద్దని ఆ ప్యాలెస్‌ను నిర్మించిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసులు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. బుధవారం నవాబ్ ఫక్రుల్ ముల్క్ మనవలు, మనవరాలు హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో ఉన్న అలీ విల్లాలో మీడియాతో మాట్లాడారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ప్యాలెస్‌ను కూల్చేసి, అసెంబ్లీ భవనం నిర్మించాలన్న ఆలోచన సరికాదని ఫక్రుల్ ముల్క్ వారసుల సంఘం అధ్యక్షుడు నవాబ్ సయ్యద్ అలీ సహరియార్ అన్నారు. ప్రస్తుతమున్న అసెంబ్లీ భవనం పటిష్టంగా ఉందని, చాలా ఖాళీ ప్రదేశం కూడా ఉందని గుర్తు చేశారు. కొత్త నిర్మాణాల పేరిట 500 కోట్లు దుర్వినియోగం చేయడం తగదని వ్యాఖ్యానించారు.
చరిత్రను ధ్వంసం చేస్తారా?
వందల ఏళ్ల నాటి వారసత్వ కట్టడంగా ఎర్రమంజిల్ ప్యాలెస్‌కు ఎంతో ఘన చరిత్ర ఉందని ఫక్రుల్ ముల్క్ మనవరాలు బేగం ఫాతిమా షహనాజ్ చెప్పారు. దానిని కూల్చేలనుకోవడం సరికాదని, కొత్త అసెంబ్లీ కావాలనుకుంటే వేరే చోట నిర్మించుకోవాలని సూచించారు. ఆ ప్యాలెస్‌లో హోలీ, రంజాన్, క్రిస్మస్‌లాంటి పండగలన్నీ ఘనంగా నిర్వహించే వారని, చారిత్రక కట్టడాలను భవిష్యత్ తరాలకు అందించాల్సింది పోయి కూల్చడం సరికాదని చెప్పారు. 1817లో నిర్మించిన ఈ ప్యాలెస్ ఇప్పటికీ పటిష్టంగా ఉందన్నారు. ప్యాలెస్‌ను కూల్చాలన్న సర్కారు నిర్ణయం తమను షాక్‌కు గురిచేసిందని ఫక్రుల్ ముల్క్ వారసుల సంఘం ఉపాధ్యక్షుడు నవాబ్ నూర్ ముజఫర్ హుస్సేన్ అన్నారు. భవనాన్ని సంరక్షిస్తామని హామీ ఇస్తేనే ప్రభుత్వానికి అప్పగించామని, కానీ దాని నిర్వహణను గాలికొదిలేశారని చెప్పారు. దీనిపై సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. చారిత్రక భవనాన్ని కూల్చేందుకు ఎన్నో నిబంధనలున్నాయని, ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శి డాక్టర్ లుగ్నా సర్వర్ పేర్కొన్నారు.