- కలెక్టర్ కార్యాలయం ముందు నవాబుపేట మండల రైతుల ధర్నా
వికారాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్పుపై వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు నవాబుపేట మండల రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ కోసం గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి హద్దులు గుర్తించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న అలైన్ మెంట్ ను మార్చిందని ఆరోపించారు.
అలైన్ మెంట్ మార్చే సమయంలో ప్రభుత్వం రైతులను సంప్రదించకుండా ఏకపక్షంగా భూములు తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త అలైన్ మెంట్ వల్ల తాము భూములు కోల్పోతున్నామని, వాటిని ఎట్టి పరిస్థతుల్లోను ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టిగిద్ద, చించల్ పేట, నవాబుపేట, దాతాపూర్ గ్రామాల రైతులు చాంద్ పాషా, పద్మరావు, శాంతి కుమార్, గోపాల్ రెడ్డి, మల్లికార్జున్, కృష్ణారెడ్డి, రహియోద్దీన్, యూసుఫూద్దీన్, రఫీయోద్దీన్, శ్రీనివాస్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
