రాష్ట్రంలో నక్సలిజం తగ్గింది

రాష్ట్రంలో నక్సలిజం తగ్గింది
  • లొంగిపోతున్నవాళ్లకు పునరావాసం కల్పిస్తున్నం
  • అదనపు ఫోర్స్​ కోసం బెటాలియన్లు కావాలి
  • అమిత్​ షాతో జరిగిన సీఎంల మీటింగ్​లో కేసీఆర్​

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో నక్సలిజం తగ్గుముఖం పట్టిందని సీఎం కేసీఆర్​ చెప్పారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల మీటింగ్​లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో సెకండ్  క్యాడర్, యాక్టివ్​గా ఉండే చాలా మంది నక్సలైట్లు జన జీవన  స్రవంతిలో కలుస్తున్నారని ఆయన వివరించినట్లు సమాచారం. గడిచిన ఏడాది కాలంలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయారని చెప్పినట్లు తెలిసింది.  ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు శారదక్కతో పాటు, పలువురు పేర్లతో కూడిన నివేదికను కేసీఆర్​ మీటింగ్​లో సమర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్  కమిటీలో దాదాపు 105 మందికి పైగా ఉంటే, అందులో తెలంగాణ నుంచి 10 మందికి పైగా, ఏపీ  నుంచి ముగ్గురు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. 

తెలంగాణలో నక్సలైట్ల ప్రభావం లేదని, చత్తీస్ గఢ్​, ఒడిశా, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి,  ఏపీ బార్డర్​లో వాళ్ల కదలికలు ఉన్నట్లు సమాచారం ఉందని ఆయన చెప్పినట్లు తెలిసింది. వీరు తెలంగాణలోకి ప్రవేశించకుండా నిరంతరం ఫోకస్  పెడుతున్నామని, తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నక్సలైట్లను జన స్రవంతిలోకి ఆహ్వానించే దిశలో పునరావాస సదుపాయాలు, కొత్త వాళ్లు నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం వంద శాతం నిధుల్ని ఇవ్వాలని సీఎం కేసీఆర్​ కోరినట్లు తెలిసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఫోర్ జి కనెక్టివిటీ వేగవంతం, ఆదివాసీ – గిరిజన ఏరియాలో ఏకలవ్య స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, ఫారెస్ట్ ఏరియాలో రోడ్ల అభివృద్ధికి పర్మిషన్ వంటి అంశాలను సమావేశంలో లేవనెత్తినట్లు సమాచారం. అదనపు ఫోర్స్ కోసం బెటాలియన్లు కోరినట్లు తెలిసింది. ఈ మీటింగ్‌‌కు సీఎం కేసీఆర్​ వెంట సీఎస్  సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఆధ్వర్యంలో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల మీటింగ్​లో మొత్తం ఆరు రాష్ట్రాల సీఎంలు, మరో నాలుగు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఇందులో  సీఎం కేసీఆర్​తోపాటు ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​, బీహార్​ సీఎం నితీశ్​కుమార్​, మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​సింగ్​ చౌహాన్​, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ థాక్రే, జార్ఖండ్​ సీఎం హేమంత్​ సోరెన్ పాల్గొన్నారు. బెంగాల్​, చత్తీస్​గఢ్​, ఏపీ, కేరళ సీఎంలు పాల్గొనాల్సి ఉండగా.. వారి స్థానంలో ఆయా రాష్ట్రాల సీనియర్​ అధికారులు హాజరయ్యారు. నక్సల్స్​ ప్రాబల్యాన్ని తగ్గించే చర్యలపై చర్చించినట్లు తెలిసింది. నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు, స్కూళ్లు, హెల్త్​ సెంటర్స్​ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.