- ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్
కోల్‌కతా: భారత్ హిందూ దేశమని ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఇది వాస్తవం కాబట్టి దీనికి ఎలాంటి రుజువులు, రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదన్నారు. భారతదేశం హిందూ దేశం అనడానికి పార్లమెంట్‌లో చట్టాలు చేయాల్సిన పనిలేదన్నారు. ఆర్ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌లో భారతీయ సంస్కృతి గౌరవం పొందుతున్నంతకాలం భారత్ హిందూ దేశంగానే ఉంటుందని చెప్పారు.
‘‘సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. మరి దానికి కూడా రాజ్యాంగ ఆమోదం అవసరమా? హిందూస్తాన్ ఒక హిందూ దేశం. భారత్‌ను తమ మాతృభూమిగా భావించే ప్రతిఒక్కరూ భారతీయ సంస్కృతిని గౌరవిస్తారు. దేశాన్ని గౌరవించే వ్యక్తి ఈ గడ్డపై బతికున్నంతకాలం భారత్ హిందూ దేశం” అని సంఘ్ చీఫ్ అన్నారు. ఒక వేళ రాజ్యాంగాన్ని సవరించి ఆ పదాన్ని చేర్చాలనుకున్నా, చేర్చకపోయినా తాము పట్టించుకోబోమని చెప్పారు. ఎందుకంటే తామంతా హిందువులమని, ఇది హిందూ దేశమని, ఇదే నిజమని అన్నారు. పుట్టుక ఆధారంగా కులాన్ని నిర్ధారించడం కూడా హిందూత్వ లక్షణం కాదని చెప్పారు. హిందూత్వ అనేది ఒక జీవన విధానమని తెలిపారు. ఆర్ఎస్‌ఎస్ ముస్లిం వ్యతిరేక సంస్థ అనే ప్రచారాన్ని భాగవత్ కొట్టివేశారు. ‘‘మేము హిందువుల రక్షణకోసం పనిచేస్తాం. జాతీయవాదులం. కానీ, ముస్లింలకు వ్యతిరేకం కాదు”అని ఆయన స్పష్టం చేశారు.
