తమ కవల పిల్లల పూర్తి పేర్లు చెప్పిన నయనతార

తమ కవల పిల్లల పూర్తి పేర్లు చెప్పిన నయనతార

సినీ దంపతులు నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసి ద్వారా గతేడాది అక్టోబర్ లో కవలలకు జన్మనిచ్చారు. అయితే ఇప్పటివరకు ఈ పిల్లల ముఖాలే కాదు.. ఈ కపుల్ వారి పూర్తి పేర్లను కూడా వెల్లడించలేదు. ఇంతకుముందు ఆ క్యూట్ చిల్డ్రన్ ఫొటోలను షేర్ చేసిన విఘ్నేష్.. వారిని ఉయిర్, ఉలగంగా పేర్కొన్నారు. కానీ వారి పూర్తి పేరేంటో మాత్రం చెప్పలేదు. వారి పిల్లలకు సంబంధించిన అప్ డేట్ కోసం ఎదురుచూస్తోన్న సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్ కోసం నయనతార ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఎట్టకేలకు వారి పిల్లల పేర్లను వెల్లడించారు. కవలల్లో ఒక కొడుకు పేరు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ అని, రెండో కొడుకు పేరు ఉలగ్ ధైవాగ్ ఎన్ శివన్ అని తెలిపారు. ఇటీవల ఆమె ఓ ఈవెంట్ పాల్గొనగా.. అక్కడ కొందరు ఆమెను వారి పిల్లల పూర్తి పేర్లను చెప్పమని అడిగారు. ఈ నేపథ్యంలో నయన్ ఈ విధంగా చెప్పుకొచ్చారు.

జూన్ 9, 2022లో డైరెక్టర్ విఘ్నేష్ శివన్, లేడీ సూపర్ నయనతార ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి దగ్గరి బంధువులను, స్నేహితులను మాత్రమే ఆహ్వానించగా.. అంగరంగవైభవంగా జరిగిన వీరి పెళ్లికి బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటులు సూర్య, రజనీకాంత్ లు కూడా హాజరయ్యారు. వీరి పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈ స్టార్ కపుల్.. వారి కాళ్లను ముద్దాడుతున్నట్టుగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పుడే వారి పేర్లను ఉయిర్, ఉలగం అంటూ విఘ్నేష్ తెలియజేశారు. నయన్, తాను ఇప్పట్నుంచి అమ్మా, నాన్నలమయ్యామంటూ రాసుకొచ్చారు. 

ఇక నయనతార సినిమా విషయానికొస్తే పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టిన ఈ స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న థ్రిల్లర్ ఫిల్మ్ జవాన్ లో షారుఖ్ ఖాన్ తో నటిస్తున్నారు. ఇది జూన్ 2, 2023న థియేటర్లలో విడుదల కానుంది.