హాస్పిటల్‌లో చేరిన మమితా బైజు.. బెడ్‌పై నుంచే స్టార్ హీరోయిన్ ఎమోషనల్ వీడియో!

 హాస్పిటల్‌లో చేరిన మమితా బైజు.. బెడ్‌పై నుంచే స్టార్ హీరోయిన్ ఎమోషనల్ వీడియో!

'ప్రేమలు' మూవీతో ఒక్కసారిగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కేరళ కుట్టి మమిత బైజు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. గత కొన్ని రోజులుగా వరుస ప్రాజెక్టులు, ప్రమోషన్లతో బిజీబిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. ఉన్నట్లుండి తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, అలెర్జీ, ఆస్తమా సమస్యలతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న మమితకు డాక్టర్లు బెడ్ రెస్ట్ సూచించడంతో ఆమె తన ప్రయాణాలన్నింటినీ రద్దు చేసుకున్నారు.

ఈ శనివారం సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో జరగాల్సిన ప్రతిష్టాత్మక 'క్లైడ్ ఓనం 2026' వేడుకల్లో ముఖ్య అతిథిగా మమిత  పాల్గొనాల్సి ఉంది. అయితే, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ఆస్ట్రేలియా పర్యటనను అత్యవసరంగా క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. అటు ఈ వేడుకను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఆసుపత్రి నుంచే ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన మమిత బైజు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ల సలహా మేరకు నేను ప్రయాణం చేయలేకపోతున్నాను. ఎలాగైనా ఈ ఈవెంట్‌కు రావాలని ప్రయత్నించాను కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. నన్ను క్షమించండి... కోలుకున్నాక త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను అని భావోద్వేగానికి లోనయ్యారు

►ALSO READ | విజయ్ సార్ మీరే చూసుకోండి.. సినిమా కష్టాలు అందరికన్న మీకే బాగా తెలుసు : పైరసీపై సీఎంకు కార్తి రిక్వెస్ట్!

ఇదిలా ఉంటే, గత నెల రోజుల్లో 'జన నాయగన్', 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'బెత్లెహోమ్ కుడుంబ యూనిట్' వంటి వరుస చిత్రాలతో మలయాళం, తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించింది మమిత.  ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ జోరు మీదున్నారు. ఈ క్రమంలో ఆమె నటించిన 'బెత్లెహోమ్ కుడుంబ యూనిట్' తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా సెప్టెంబర్ 4న విడుదలవుతుంది. సినిమా గ్రాండ్ రిలీజ్ సమయానికి కథానాయిక ఇలా ఆస్పత్రిపాలు కావడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు గెట్ వెల్ సూన్ మెసేజ్‌లతో పోస్టులు పెడుతున్నారు.