పోల్​ మేనేజ్​మెంట్​పై నజర్.. ఓటర్లను తమకు వైపు తిప్పుకునేందుకు ప్లాన్స్

పోల్​ మేనేజ్​మెంట్​పై నజర్.. ఓటర్లను తమకు వైపు తిప్పుకునేందుకు ప్లాన్స్
  • ప్రత్యేకంగా టీమ్​లను ఏర్పాటు చేసుకున్న పార్టీల అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారం ముగింపు గడువు దగ్గరపడుతుండటంతో పార్టీల అభ్యర్థులు పోల్​ మేనేజ్​మెంట్​పై దృష్టిపెడుతున్నారు. పోలింగ్​ రోజున అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఓటు వేసేలా ప్రజలను ఎలా ఆకట్టుకోవాలన్న అంశాలపైనా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్​కు చెందిన పలువురు అభ్యర్థులు ఇప్పటికే తమ సన్నిహితులతో ప్రత్యేకంగా టీమ్​లను ఏర్పాటు చేసుకున్నారు. అత్యంత సన్నిహితులను ఎంచుకుని పోల్ ​మేనేజ్​మెంట్​పై చర్చించుకుంటున్నారు. ఈ బృందాలు ప్రతి రోజూ నియోజకవర్గాల్లో తిరిగి పార్టీ ప్రచారం ఎలా ఉందన్న దానిపై రిపోర్ట్​లు ఇస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు, బూత్​కమిటీలు, డివిజన్​కమిటీలకు అప్పగించిన పనులు సరిగా నిర్వహిస్తున్నారా? లేదా? అనేదాన్ని గమనిస్తున్నాయి. సనత్​నగర్​, ముషీరాబాద్​, అంబర్​పేట, సికింద్రాబాద్​, ఖైరతాబాద్​ తదితర నియోజకవర్గాల్లో కాంగ్రెస్​, బీఆర్​ఎస్, బీజేపీ అభ్యర్థులు పోల్ ​మేనేజ్​మెంట్​పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అనుకూలంగా ఓట్లు పడతాయన్న ప్రాంతాల్లోని ఓటర్లను పోలింగ్​ సెంటర్ దాకా ఎలా చేర్చాలి? పోలింగ్​ బూత్​ వరకూ వచ్చే పరిస్థితి లేనివారికి వాహనాలను సమకూర్చడం వంటి విషయాలపై చర్చించుకుంటున్నారు.

కార్యకర్తలపై కూడా నిఘా

కొందరు అభ్యర్థులు ఒక అడుగు ముందుకేసి తమ పార్టీకి చెందిన కార్యకర్తల వ్యవహారాలను పరిశీలించేందుకు తమ సన్నిహితులను నియమించుకున్నారు. రోజు చేస్తున్న ఖర్చులో భాగంగా కార్యకర్తలు ఎలా వ్యవహరిస్తున్నారన్నది చూసుకుంటున్నారు. కొందరు కార్యకర్తలను కోవర్టుల మాదిరిగా కూడా ఉపయోగించుకుంటున్నారు. అపొజిషన్ ఏం జరుగుతోందన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. గెలుపు కోసం ప్రత్యర్థులు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని తామూ అంతకుమించి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి రోజూ రాత్రికల్లా బూత్​ కమిటీలను కలిసి ఆరోజు చేసిన పనులను అడిగి తెలుసుకుంటున్నారు. రోజువారీగా వారికి ఇచ్చే మొత్తాన్ని చెల్లిస్తున్నారు. మొత్తానికి పోలింగ్​ తేదీ నాటికి తమ వ్యక్తిగత బృందాల సాయంతో పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు అభ్యర్థులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.