
మణిపూర్ ఘటనను జాతీయ మహిళా కమిషన్( NCW) ఖండించింది. ఘటను సుమోటోగా తీసుకుంటున్నట్లు ఎన్సీడబ్ల్యూ ట్వీట్ చేసింది. ఘటనపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని మణిపూర్ డీజీపీని ఆదేశించింది.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయగా.. సాయంత్ర వరకు మిగతా నిందితులను పట్టుకునే అవకాశం ఉందన్నారు ఎన్సీ డబ్ల్యూ చీఫ్ రేఖాశర్మ. మణిపూర్ లాంటి వీడియోలను ప్రసారం చేయడానికి అనుమతించకుండా ట్విట్టర్‌కు నోటీసు కూడా ఇచ్చామన్నారు. రాజస్థాన్, మణిపూర్ నుంచి ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందన్నారు.
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని..మహిళలపై జరిగే అఘాయిత్యాలపై కలిసి పోరాడాలన్నారు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మణిపూర్ ఘటనపై సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన సుప్రీం.. కేసును సుమోటోగా తీసుకుంది. ఈ ఘటన చాలా బాధాకరమని ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి తగు సమయం ఇస్తామని..ఒక వేళ తగిన చర్యలు తీసుకోకుంటే తాము తీసుకుంటామని హెచ్చరించింది.